దిగొచ్చిన జేఎన్‌యూ

Thu,November 14, 2019 04:06 AM

-పెంచిన హాస్టల్‌ ఫీజు పాక్షికంగా తగ్గింపు
-ప్రధాన డిమాండ్లు నెరవేరలేదన్న విద్యార్థి సంఘం

న్యూఢిల్లీ, నవంబర్‌ 13: పెంచిన హాస్టల్‌ ఫీజును రద్దు చేయాలంటూ ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు యాజమాన్యం దిగివచ్చింది. పెంచిన ఫీజును పాక్షికంగా తగ్గిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అంతేగాక ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆదుకుంటామని తెలిపింది. మరోవైపు జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు సాయి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులను మోసగించడానికే ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదని, ఈ నేపథ్యంలో తాము ఆందోళనను విరమించేది లేదని చెప్పారు. మరి కొంత మంది విద్యార్థులు స్పందిస్తూ ప్రస్తుతం యూనివర్సిటీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కేవలం ‘చాక్లెట్‌' లాంటిదని, తమ ప్రధాన డిమాండ్లు ఇంకా పరిష్కారంకాలేదని పేర్కొన్నారు. హాస్టల్‌ ఫీజునుపెంచాలని, డ్రెస్‌కోడ్‌ను అమలు చేయాలని, హాస్టల్‌లో విద్యార్థులు కచ్చితంగా టైమింగ్స్‌ను పాటించాలని రూపొందించిన ‘హాస్టల్‌ మాన్యువల్‌ డ్రాఫ్ట్‌'ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసన గతనాలుగైదు రోజుల నుంచి ఉద్ధృతమైంది. ప్రధానంగా సోమవారం యూనివర్సిటీ స్నాతకోత్సవం రోజును పురస్కరించుకొని వందలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. ఈసందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వీరి ఆందోళన తీవ్రం అవుతున్న నేపథ్యంలోనే యూనివర్సిటీ హాస్టల్‌ ఫీజును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles