అసెంబ్లీలో జయ ఫొటోపై వివాదంTue,February 13, 2018 01:27 AM

ఆవిష్కరణకు దూరంగా డీఎంకే, కాంగ్రెస్, దినకరన్ ఇది ముమ్మాటికీ అసెంబ్లీని అవమానించడమేనన్న స్టాలిన్ ఫొటోను తొలిగించాలని కోర్టులో డీఎంకే పిటిషన్
Jaya-portrait
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో జయలలిత ఫొటో ఏర్పాటు వివాదానికి తెరలేపింది. ఫొటో ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ దూరంగా ఉన్నాయి. జయ ఫొటో ఏర్పాటు ముమ్మాటికీ అసెంబ్లీని అవమానించడమేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు. మరోవైపు జయ ఫొటోను తొలిగించాలని చెన్నై హైకోర్టులో డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారిస్తామని ధర్మా సనం తెలిపింది. అంతకుముందు అసెంబ్లీ హాలులో ఏర్పాటుచేసిన జయలలిత ఫొటోను స్పీకర్ ధన్‌పాల్ సోమవారం ఆవిష్కరించారు. ఏడు అడుగుల ఎత్తున్న జయలలిత చిత్తరువును అసెంబ్లీ హాలులో ఆవిష్కరించే కార్యక్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా మంత్రులు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష డీఎంకే సహా కాంగ్రెస్, ఐయూఎంఎల్ సభ్యులు బహిష్కరించారు. ఇటీవల ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా జయలలిత ఫొటో ఆవిష్కరణ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

కాగా అసెంబ్లీ హాలులో జయ ఫొటోను పెట్టడంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. అవినీతి కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఫొటోను అసెంబ్లీ హాలులో నెలకొల్పడం సముచితం కాదని ఆ పార్టీ పేర్కొంది. జయలలిత బ్రతికుంటే శశికళతో కలిసి జైలు ఊచలు లెక్కబెట్టేవారే. తమిళుల గౌరవాన్ని చాటిన గొప్ప వ్య క్తుల మధ్య నేరస్థురాలైన జయలలిత ఫొటో ఉంచడమేంటి? అని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రశ్నించారు. తక్షణమే జయ ఫొటోను తొలిగించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జయలలిత ఫొటో ఆవిష్కరణ జరుగగానే చెన్నై హైకోర్టును డీఎంకే ఆశ్రయించగా, మంగళవారం విచారించాలని చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ బెంచ్ నిర్ణయించింది.

796

More News

VIRAL NEWS