ఆజంఖాన్ వ్యాఖ్యలపై దుమారం


Tue,April 16, 2019 03:01 AM

Jaya Prada hits back at Azam Khan after khaki underwear controversy

-కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన మహిళా కమిషన్
-ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్న రాంపూర్ మేజిస్ట్రేట్
-పోటీకి అనర్హుడిని చేయాలన్న జయప్రద
-ఎవరినీ పేరుపెట్టి వ్యాఖ్యానించలేదంటూ ఆజంఖాన్ వివరణ
లక్నో, ఏప్రిల్ 15: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, సినీ నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, అదే స్థానం నుంచి పోటీచేస్తున్న ఆజంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్ ఆజంఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీని) కోరింది. ఆజంఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని రాంపూర్ జిల్లా కలెక్టర్ ఆంజనేయకుమార్‌సింగ్ తెలిపారు. పార్టీలకతీతంగా పలువురు నాయకులు ఆజంఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. ఆదివారం జరిగిన ఒక ఎన్నికల సభలో ఆజంఖాన్ తన ప్రత్యర్థి జయప్రద పేరు ప్రస్తావించకుండానే ఆమె లోదుస్తుల రంగు విషయమై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను (జయప్రదను) మీరు పదేండ్లపాటు మీ ప్రతినిధిగా ఎన్నుకున్నారు.

రాంపూర్ వాసులారా, ఉత్తర్‌ప్రదేశ్ వాసులారా, హిందుస్థాన్ వాసులారా.. ఆమె నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి మీకు 17 ఏండ్లు పట్టింది. కానీ ఆమె అండర్‌వేర్ రంగు ఖాకీదని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను అని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ ఖాకీ నిక్కరును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేసినట్టు తెలుస్తున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జయప్రదకు వ్యతిరేకంగా ఆజంఖాన్ రెండు పర్యాయాలు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్‌పర్సన్ రేఖాశర్మ సోమవారం ఈసీకి ఒక లేఖ రాశారు. అంతేకాకుండా ఎన్సీడబ్ల్యూ ఆజంఖాన్‌కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు ప్రమాదకరం, అనైతికం, మహిళల గౌరవాన్ని అవమానపరిచేవిగా ఉన్నాయి అని పేర్కొంది. అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో పూర్తి వివరణ ఇవ్వాలని ఎన్సీడబ్ల్యూ కార్యదర్శి బర్నాలీ షోమ్ ఆజంఖాన్‌కు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.

లక్ష్మణ రేఖ దాటాడు: జయప్రద


Jaya-Prada
ఆజంఖాన్ తనకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా లక్ష్మణ రేఖను దాటాడని, అతడు తనకు ఇంకెంత మాత్రం సోదరుడు కాదని జయప్రద మండిపడ్డారు. ఇంతకాలం అతడిని తన సోదరుడిగా భావించి అన్నీ సహించానని.. కానీ ఈసారి మాత్రం క్షమించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె రాంపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ, ప్రజలే ఆయనకు సమాధానం చెప్తారని అన్నారు. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు అసలు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిని చేయాలని ఈసీని కోరుతున్నాను అని చెప్పారు. ఆజంఖాన్ వ్యాఖ్యలకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సమాధానం చెప్పాలని జయప్రద డిమాండ్ చేశారు. అఖిలేశ్! ఇటువంటి వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించవచ్చా? సిగ్గుచేటు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలి అంటూ ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా జయప్రద ఒక సంస్కృతం శ్లోకాన్ని వినిపించారు. ఏ కుటుంబంలో మహిళలు గౌరవింపబడుతారో.. ఆ కుటుంబం ఆధ్యాత్మిక లక్షణాలతో, ఆధ్యాత్మిక భోజనంతో, పిల్లలతో దీవింపబడుతుంది. మహిళలకు తగిన గౌరవం ఇవ్వని కుటుంబాల్లో.. వారు ఏ పనిచేసినా సత్ఫలితాలనివ్వవు అని వివరించారు. ఆజంఖాన్ వ్యాఖ్యలు ఆయన సంకుచిత మనస్తత్వాన్ని వెల్లడిస్తున్నాయని యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఆజంఖాన్ వ్యాఖ్యల విషయంలో అఖిలేశ్, మాయావతి మౌనంగా ఉండటం సిగ్గుచేటు అంటూ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, తాను జయప్రదను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆజంఖాన్ చెప్పారు. తన ప్రసంగంలో తాను ఎవరినీ పేరుపెట్టి వ్యాఖ్యానించలేదని, అలాగే ఎవరి విషయంలోనూ సానుకూలంగా లేదా ప్రతికూలంగా మాట్లాడలేదని చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఓ వ్యాధిగ్రస్థుడి గురించి ఆ వ్యాఖ్యలు చేశానని, ఆ వ్యక్తి 150 రైఫిళ్లతో తనపై బుల్లెట్ల వర్షం కురిపిస్తానని చెప్పాడని ఆజంఖాన్ గుర్తు చేశారు. ఆ వ్యక్తి వేసుకున్న ఆరెస్సెస్ నిక్కరు (ఖాకీ) రంగు గురించి మాట్లాడానని తెలిపారు. తాను ఎవరి పేరునైనా ప్రస్తావించి లేక ఎవరిపైనైనా బురద జల్లినట్టు నిరూపిస్తే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఈ నెల 23న రాంపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.

926
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles