ఐదోరోజూ శ్రీనగర్ రహదారి మూత


Mon,February 11, 2019 01:39 AM

Jammu Srinagar highway closed for 5th consecutive day

- తాజాగా కొండ చరియలు విరిగిపడటమే కారణం
బనిహాల్ / జమ్ము, ఫిబ్రవరి 10: కశ్మీరును దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక కీలక మార్గమైన జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి వరుసగా ఐదోరోజు కూడా మూతపడింది. ఆదివారం తాజాగా విరిగిపడిన కొండ చరియలు వివిధ ప్రాంతాల్లో ఈ రోడ్డు పునరుద్ధరణ పనులకు విఘాతం కలిగించడమే ఇందుకు కారణం. అయినప్పటికీ ఈ రహదారిని పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల తొలగింపులో పురోగతిని సమీక్షించి వాహనాల రాకపోకలను అనుమతించే విషయమై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షాలకు తోడు భారీగా మంచు కురువడం వల్ల వివిధ ప్రాంతాల్లో, ప్రత్యేకించి కశ్మీరు లోయకు ముఖద్వారమైన జవహర్ సొరంగం సహా క్వాజీగంద్-బనిహాల్-రాంబన్ మధ్యన హిమపాతాలు సంభవించడం, కొండ చరియలు విరిగిపడటంతో బుధవారం నుంచి ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసి పునరుద్ధరణ పనులు చేపట్టారు. శనివారం తీవ్రంగా మంచు కురువడంతో పాటు కొండల పైనుంచి రాళ్లు విరిగిపడినప్పటికీ డజనుకుపైగా శిథిలాలను తొలగించామని, అయితే కేలామోర్హ్, బ్యాటరీ చెష్మా, డిగ్డోల్, పాంథియాల్, ఖునినల్లా తదితర ప్రాంతాల్లో ఆదివారం కొండ చరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని మరోసారి మూసివేయాల్సి వచ్చిందని రాంబన్ ట్రాఫిక్ డీఎస్పీ సురేశ్ శర్మ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈ మార్గం మూతబడటంతో ప్రత్యేక సహాయ చర్యలు చేపట్టేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) రంగంలోకి దిగిందని, జమ్ము-శ్రీనగర్ మధ్య చిక్కుకుపోయిన 319 మంది గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) అభ్యర్థులు సహా మొత్తం 538 మంది వ్యక్తులను సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం ద్వారా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి జమ్ము విమానాశ్రయానికి తరలించారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇదిలావుంటే, జమ్ము డివిజన్‌లోని కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగడంతో పరిస్థితి కొంత మెరుగుపడింది.

హిమాచల్‌లో మంచు వర్షం

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లాతోపాటు కాంగ్రా జిల్లా ముల్థాన్‌లో భారీగా మంచు కురువడంతో ఆ ప్రాంతాల్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులను మరో రెండ్రోజులు పొడిగించారు. దీంతో ఆ పాఠశాలలను సోమవారానికి బదులుగా బుధవారం (ఈ నెల 13న) తిరిగి తెరువనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో మరో వారం రోజులపాటు భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ పేర్కొన్నది.

పంజాబ్, హర్యానాలో సాధారణ స్థాయి కంటే తక్కువ ఉష్ణోగ్రతలు

పంజాబ్, హర్యానాలోని చాలా ప్రాంతాల్లో ఆదివారం సాధారణ స్థాయి కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నౌల్‌లో అత్యల్పంగా 3.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఆ జిల్లాలోని ద్రాక్ష రైతులు తమ పంటను కాపాడుకునేందుకు చలిమంటలు వేస్తున్నారు.

1294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles