పరిస్థితులు మెరుగవ్వగానే.. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా

Tue,October 8, 2019 03:49 AM

-2018 ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులతో హోంమంత్రి అమిత్‌షా
-దేశభద్రతతోపాటు సుపరిపాలనకు ఎన్‌ఆర్సీ.. రాజకీయ ప్రక్రియగా చూడొద్దు

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జమ్ముకశ్మీర్ ఎప్పటికీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండబోదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. భద్రతా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని చెప్పారు. సోమవారం ఆయన 2018 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనరీ అధికారులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆగస్టు ఐదో తేదీన జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని రద్దుచేయడంతోపాటు ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని, సింగిల్ బుల్లెట్ కూడా ప్రయోగించలేదని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని షా చెప్పినట్లు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 370వ అధికరణం మాత్రమే కశ్మీరీ సంస్కృతిని, ఉనికిని కాపాడుతుందన్న భావన తప్పు అని అమిత్‌షా అన్నారు.

భారత రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల ఉనికిని, గుర్తింపును కాపాడుకోవచ్చునన్నారు. 370 అధికరణం దుర్వినియోగం కూడా సీమాంతర ఉగ్రవాదానికి ఒక కారణమని అమిత్‌షా వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లోని 196 పోలీస్ స్టేషన్లకు గాను 10 పోలీస్ స్టేషన్లలోనే 144 సెక్షన్ అమలులో ఉన్నదని పేర్కొన్నారు. ప్రజలకు లబ్ధి చేకూర్చడానికే కఠినమైనా కశ్మీర్‌పై సరైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జాతీయ భద్రతతోపాటు సుపరిపాలనకు కూడా జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్సీ) ముఖ్యమేనన్నారు. దేశ పౌరులందరికీ అభివృద్ధి ఫలాలను అందుబాటులోకి తేవడానికే ఎన్‌ఆర్సీ అమలు చాలా ముఖ్యమని చెప్పారు. దీన్ని రాజకీయ ప్రక్రియగా చూడొద్దన్నారు.

294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles