సచివాలయంపై కశ్మీర్‌ జెండా తొలిగింపు


Mon,August 26, 2019 01:45 AM

Jammu And Kashmir Flag Gone From Srinagar Civil Secretariat

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ఆదివారం శ్రీనగర్‌లోని పౌర సచివాలయ భవనం నుంచి రాష్ట్ర జెండాను అధికారులు తొలిగించారు. దాని స్థానంలో త్రివర్ణ పతాకం ఎగురువేశారు. ఇకపై జాతీయ జెండా ఒక్కటే అక్కడ ఎగురనుంది. ఇతర ప్రభుత్వ భవనాల్లోనూ ఇకపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు వరకు జమ్ముకశ్మీర్‌కు జాతీయ జెండాతోపాటు ప్రత్యేకంగా రాష్ట్ర జెండా ఉండేది. ఎరుపు రంగు జెండాలోని మూడు చారలు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను (కశ్మీర్‌ లోయ, జమ్ము, లడఖ్‌) ప్రతిబింబించేవి. జెండాలోని నాగలి రాష్ట్రంలోని రైతాంగానికి చిహ్నం. రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపుగా ఈ జెండాను రూపొందించారు. అయితే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో కశ్మీర్‌ ప్రత్యేకంగా రాష్ట్ర జెండాను కలిగి ఉండే హక్కును కోల్పోయింది.

పది రోజుల్లో ప్రాణనష్టం కూడా లేదు: గవర్నర్‌

కశ్మీర్‌లోయలో ల్యాండ్‌లైన్‌, మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సమర్థించారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడిందని చెప్పారు. గత పది రోజుల్లో హింసాత్మక ఘటనల్లో జమ్ముకశ్మీర్‌లో ఒక్క మరణం కూడా చోటుచేసుకోలేదని తెలిపారు. ‘జమ్ముకశ్మీర్‌లో గతంలో సంభవించిన సంక్షోభ పరిస్థితుల్లో మొదటి వారంలోనే కనీసం 50 మందిదాకా చనిపోయేవారు. ఈ ప్రాణనష్టం జరుగకూడదన్నదే మా ఉద్దేశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మందులు, ఆహార పదార్థాల కొరతపై వస్తున్న వార్తలను ఆయన కొట్టివేశారు. ‘కశ్మీర్‌లో నిత్యవసరాలకు, మందులకు ఎలాంటి కొరత లేదు. వాస్తవానికి, ఈద్‌ సమయంలో మాంసం, కూరగాయలు, గుడ్లను ప్రజల ఇంటి వద్దకే డెలివరీ చేశాం’ అని చెప్పారు. శ్రీనగర్‌లోని 1,666 మెడికల్‌ షాపుల్లో 1,165 దుకాణాలు ఆదివారం కూడా తెరిచే ఉన్నాయి.

1515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles