కశ్మీర్‌లో ఆంక్షల ఎత్తివేత

Tue,October 8, 2019 03:51 AM

10వ తేదీ నుంచి పర్యాటకులకు అనుమతి.. గవర్నర్ ఆదేశాలు
శ్రీనగర్/ జమ్ము: కశ్మీరీలకు కాసింత ఉపశమనం లభించనున్నది. రెండు నెలలకు పైగా కశ్మీర్‌లోయలో కొనసాగిన భద్రతాపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను సోమవారం ఆదేశించారు. దీని ప్రకారం ఈ నెల 10 నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. కశ్మీర్‌ను పర్యాటకులు వీడాలని జారీ చేసిన ఆంక్షలను తక్షణం ఎత్తివేయాలని గవర్నర్ ఆదేశించారు. ఈ నిర్ణయం ఈ నెల 10 నుంచి అమలులోకి రానుంది అని జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. గవర్నర్ సలహాదారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రతినిధి పేర్కొన్నారు. ఇంతకుముందు ఉగ్రవాద ముప్పు ఉన్నందున పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్ర భక్తులు సాధ్యమైనంత త్వరగా కశ్మీర్ లోయను వీడాలని ఈ ఏడాది ఆగస్టు 2న జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఆదేశించింది.


అటుపై ఆగస్టు ఐదో తేదీన కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ర్టాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. కాగా, కశ్మీర్‌లో సోమవారం వరుసగా 64వ రోజు జన జీవనం స్తంభించింది. మార్కెట్లు మూతపడ్డాయి. శ్రీనగర్‌తోపాటు ఇతర జిల్లాల్లో ప్రైవేట్ వాహనాలు తిరిగాయి. శ్రీనగర్‌లో ఆటోలు, అంతర్‌జిల్లా క్యాబ్ సర్వీసులు నడిచాయి. శ్రీనగర్‌లో దుకాణాలు మధ్యాహ్నం 11 గంటలకే మూతపడ్డాయి. సున్నిత ప్రదేశాల్లో భారీగా బలగాలను మోహరించారు. హంద్వారా, కుప్వారా మినహా కశ్మీర్ లోయలో మొబైల్ ఫోన్ సర్వీసులను సస్పెండ్ చేశారు.

సాంబలో ఫిరంగి గుండ్లు లభ్యం

జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలోని ఘాగ్వాల్ ప్రాంతం సంగ్వాలీ మోర్హ్ గ్రామంలో సోమవారం ఉదయం 81 మి.మీ. ఫిరంగి గుండ్లను కనుకొన్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సైన్యం, పోలీసు బాంబు డిస్పోజబుల్ స్కాడ్ వాటిని నిర్వీర్యం చేశారు.

348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles