బాబ్రీ మసీదును పునర్నిర్మించాలి

Tue,December 3, 2019 03:09 AM

-అప్పుడే సంపూర్ణ న్యాయం జరుగుతుంది
-అయోధ్యపై తీర్పును సమీక్షించాలి
-సుప్రీంకోర్టులో జమియత్ ఉలేమా హింద్ పిటిషన్

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద భూమి విషయంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తేనే సంపూర్ణ న్యాయం జరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణం కోసం అప్పగిస్తూ నాటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత నెల 9వ తేదీన తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ కేసులో ప్రధాన కక్షిదారుగా ఉన్న సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరరాదని ఇప్పటికే నిర్ణయించింది. కాగా జమియత్ ఉలేమా హింద్ ఉత్తర్‌ప్రదేశ్ శాఖ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ అషద్ రషీదీ తీర్పును సమీక్షించాలని కోరుతూ తాజా పిటిషన్ దాఖలు చేశారు. మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లోగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కూడా ఆయన కోరారు. మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చిందని, కానీ ముస్లిం కక్షిదారులు ఎన్నడూ అటువంటి విజ్ఞప్తిని చేయలేదని పిటిషనర్ గుర్తు చేశారు. మసీదును ధ్వంసం చేయడం సహా హిందూ కక్షిదారులు పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఒప్పుకున్న న్యాయస్థానం వారిని క్షమించడమే కాకుండా సదరు స్థలాన్ని కూడా వారికే మంజూరు చేసిందని తెలిపారు. కోర్టు తన తీర్పు ద్వారా బాబ్రీ మసీదును కూల్చి రాముని గుడి కట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్నదని పేర్కొన్నారు. తాము తీర్పు మొత్తాన్ని సమీక్షించాలని కోరడం లేదని, కొన్ని లోపాలను మాత్రమే సమీక్షించాలని కోరుతున్నామన్నారు. 1934లో బాబ్రీ మసీదు గోపురాలను కూల్చడం దగ్గర నుంచి 1992లో మసీదును ధ్వంసం చేసే వరకు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన వారికి అనుకూలంగా ధర్మాసనం తీర్పు ఎలా వెలువరించిందన్నారు.

మూకస్వామ్యానికి చట్టబద్ధత కల్పించినట్లుంది


జమియత్ ఉలేమా ఏ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ ఢిల్లీలో మాట్లాడుతూ, అయోధ్యపై కోర్టు ఇచ్చిన తీర్పు మెజారిటీవాదానికి, మూకస్వామ్యానికి చట్టబద్ధత కల్పించినట్లుందని వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆధారంగానే కోర్టు తీర్పును సమీక్షించాలని పిటిషన్ వేశామని తెలిపారు.

694
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles