మూకహత్య వెనుక భారీ కుట్ర


Thu,December 6, 2018 02:23 AM

Its a big conspiracy says UP DGP OP Singh

-ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్
-అల్లర్లు జరిగినప్పుడు అక్కడ లేను : ప్రధాన నిందితుడు యోగేశ్

లక్నో, డిసెంబర్ 5: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం గోవధ జరుగడం.. తదనంతరం చెలరేగిన హింసాకాండలో ఓ పోలీసు అధికారి చనిపోవడం వెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర డీజీపీ ఓపీసింగ్ పేర్కొన్నారు. అల్లర్లు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి డీజీపీ ఈ ఘటపై స్పందించారు. అల్లర్లలో భాగంగా ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో పోలీసు అధికారి సుబోధ్‌సింగ్‌తోపాటు ఓ ఆందోళనకారుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. బులందర్‌షహర్ జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల వెనుక పెద్ద కుట్ర ఉన్నది. ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదు. ఆవు కళేబరాలు గ్రామంలోకి ఎలా వచ్చాయి? వాటిని ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు, ఏ పరిస్థితుల్లో వాటిని తీసుకొచ్చారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అని డీజీపీ పేర్కొన్నారు. మరోవైపు రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు కొద్దినెలల ముందు జరిగిన బులంద్‌షహర్ ఘటన వెనుక ఉన్న కారణాలు ఏమిటి? మతపరమైన హింసను రెచ్చగొట్టేందుకు ప్రణాళిక ప్రకారం ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం భద్రతపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోవధకు కారకులను అరెస్ట్‌చేయాలని ఆదేశాలు జారీచేశారు. మరోవైపు తాను అల్లర్లు జరిగిన ఘటనాస్థలంలో లేనని, హింసలో తన ప్రమేయం ఏమీ లేదని పరారీలో ఉన్న యోగేశ్‌రాజ్ ఓ వీడియోను విడుదల చేశాడు. ఇది పలు టీవీ చానెళ్లలో ప్రసారం అయింది.

గోవధ కేసులో ఏడుగురు ముస్లింలపై ఎఫ్‌ఐఆర్

బులంద్‌షహర్ హింస కేసులో ప్రధాన నిందుతుడైన యోగేశ్‌రాజ్ అల్లర్లకు ముందు చేసిన ఫిర్యాదు మేరకు.. గోవధకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న నయాబన్స్ గ్రామానికి చెందిన ఏడుగురు ముస్లింలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ గ్రామం అల్లర్లు చోటుచేసుకున్న చింగ్రావటి గ్రామానికి 3కి.మీ. దూరంలో ఉన్నది. ఈ ఏడుగురిలో ఇద్దరు 11, 12 ఏండ్ల వయస్సు కలిగిన మైనర్లని, మరొకరు గ్రామంలోనే లేరని, మరోవ్యక్తి 40 కి.మీ. దూరంలో జరిగిన ఇజ్‌తెమా ముస్లింల సమావేశానికి వెళ్లారని విచారణకు వచ్చిన పోలీసులకు గ్రామస్థులు తెలిపారు. ఘటన జరిగిన రోజు పిల్లలు తప్ప ఎవరూ గ్రామంలో లేరని వెల్లడించారు. చిన్నపిల్లలపై కేసు ఎలా నమోదు చేస్తారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ పేరిట పిల్లలను నాలుగు గంటలపాటు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారని వారి బంధువులు పేర్కొన్నారు. గోవధ, అల్లర్ల కేసులపై వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS