కాలంతో ఇస్రో పోటీ


Wed,September 11, 2019 02:16 AM

ISRO keeps up bid to link with moon lander Vikram

- ల్యాండర్ యాంటెన్నాలు పునరుద్ధరించే పనిలో శాస్త్రవేత్తలు
- విక్రమ్ నుంచి సంకేతాల కోసం ప్రయత్నాలు
- 72 గంటలు గడిచినా స్పందించని ల్యాండర్
- ల్యాండర్‌లోనే ప్రజ్ఞ రోవర్
- సంకేతాలకు స్పందించని ల్యాండర్బెంగళూరు, సెప్టెంబర్ 10: చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొన్న ల్యాండర్ విక్రమ్‌ను పనిచేయించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కాలంతో పోటీ పడుతున్నది. చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా ఆర్బిటార్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కి.మీ. ఎత్తుకు చేరిన అనంతరం ఇస్రోతో సంబంధాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడానికి ఉద్దేశించిన ప్రజ్ఞ రోవర్ ల్యాండర్‌లోనే చిక్కుకుపోయి ఉంది. చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటార్‌లోని కెమెరాలు ల్యాండర్‌ను గుర్తించాయని ఇస్రో మంగళవారం ధ్రువీకరించింది. ల్యాండర్‌తో తిరిగి సంబంధాలు నెలకొల్పేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఆర్బిటార్‌లోని కెమెరాలు పంపిన ఫొటోల ప్రకారం, విక్రమ్ సురక్షితంగా ఉన్నదని, అది ముక్కలుగా విరిగిపోలేదని ఇస్రోకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే అది ఒకవైపు ఒరిగిపోయి ఉన్నదని చెప్పారు. సాధారణంగా దానికున్న నాలుగు కాళ్లతో అది చంద్రునిపై ల్యాండ్ కావాల్సి ఉందని కానీ అలా జరుగలేదని పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ అధికారి వివరించారు.

ల్యాండర్ పరిస్థితిపై ఇస్రో అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ల్యాండర్‌కున్న యాంటెన్నాలను పునరుద్ధరించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాంటెన్నాలు పనిచేస్తే ల్యాండర్‌తో కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని భావిస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను దింపే ప్రక్రియలో భాగంగా చివరి దశలో వేగాన్ని తగ్గించినప్పుడు సెన్సర్ లేదా దానిలోని సాఫ్ట్‌వేర్ లేదా కంప్యూటర్ క్రమరాహిత్యం వల్ల యాంటెన్నాలతో సంబంధాలు తెగిపోయి ఉండవచ్చని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. అసలు ఏం జరిగిందో తెలుసుకొనేందుకు ఒక కమిటీ ప్రయత్నిస్తున్నదని, త్వరలోనే వారు సమాధానాలతో ముందుకు వస్తారని చెప్పారు.

ప్రతిస్పందన కోసం శాస్త్రవేత్తల ఎదురుచూపులు

విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు చేస్తున్న ప్రయత్నాలేమిటో ఇస్రో ఇంతవరకు అధికారికంగా వెల్లడించలేదు. దీనిపై కొందరు శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. విక్రమ్ (ల్యాండర్)కు ఏ ఫ్రీక్వెన్సీలో సంకేతాలు పంపితే అది స్పందిస్తుందో ఇస్రోకు మాత్రమే తెలుసు. ఆ దిశగా పలు రూపాల్లో విక్రమ్‌కు సంకేతాలు పంపుతూ అక్కడి నుంచి సమాధానం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం బెంగళూరుకు సమీపంలోని బయలాలులో నెలకొల్పిన 32 మీటర్ల యాంటెన్నాను ఉపయోగిస్తున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. భూమిపై నుంచి సంకేతాలను అందుకొని తిరిగి ప్రతిస్పందించేలా విక్రమ్‌కు మూడు ట్రాన్స్‌పాండర్లను, ఒక యాంటెన్నాను అమర్చారు. విక్రమ్ వీటి ఆధారంగా సిగ్నల్స్‌ను అందుకొని, విశ్లేషించి, స్పందించాలి. కానీ కమ్యూనికేషన్ వ్యవస్థకు దూరమైన విక్రమ్ నుంచి గత 72 గంటలుగా ఎటువంటి స్పందన లేదు. ఈ వ్యవస్థ అంతా పనిచేసే స్థితిలోనే ఉందో లేదో ఇస్రో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ వ్యవస్థ మొత్తం పనిచేయడానికి ఇంధనం కావాలి. విక్రమ్‌కు అమర్చిన సోలార్ ప్యానెల్ ద్వారా ఇంధనం సమకూరుతుంది.

అయితే ఇస్రో ప్రణాళిక ప్రకారం అది చంద్రునిపై దిగి ఉంటే ఇప్పటికే సౌరశక్తిని గ్రహించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేది. విక్రమ్‌లో ఒక బ్యాటరీని కూడా అమర్చారు. కానీ ప్రస్తుతం విక్రమ్‌లో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నదో లేదో అన్నది అస్పష్టంగా ఉంది. హార్డ్ ల్యాండింగ్ కారణంగా విక్రమ్‌లోని కొన్ని వ్యవస్థలు దెబ్బతిని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రునిపై పగటివేళలో మాత్రమే ఈ వ్యవస్థ అంతా పనిచేసే అవకాశముంది. ఒక్కసారి చీకట్లు ఆవరిస్తే..ఆ చలికి ల్యాండర్, రోవర్ సహా వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుందని చంద్రయాన్ ప్రయోగానికి ముందే ఇస్రో అంచనా వేసింది. చంద్రునిపై ఒక పగటివేళ భూమిపై 14 రోజులతో సమానం.
Vikram-Lander1

చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడం ఆషామాషీ కాదు

ముంబై, సెప్టెంబర్ 10: చంద్రుని దక్షిణ ధ్రువంలోని ఉపరితలంలో అ త్యంత క్లిష్టమైన వాతావరణం ఉంటుందని, అక్కడ ఆవేశపూరిత కణాలు, రేడియేషన్ ధూళిలో కలిసి ఉంటాయని యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈసా) గతేడాది రూపొందించిన ఒక నివేదికలో పేర్కొంది. చంద్రునిపై ఉండే ధూళికి జిగురు స్వభావం ఉంటుందని తెలిపింది. ఆ ధూళి కారణంగా పరిశోధన కోసం మనం పంపే యంత్రాలకు సమస్యలు ఏర్పడవచ్చని అభిప్రాయపడింది. ఆ ధూళి మనం పంపే యంత్ర పరికరానికుండే సోలార్ ప్యానెళ్లపై పడితే వాటి సామర్థ్యం తగ్గిపోతుందని తెలిపింది. చంద్రుని ఉపరితలంపై ఉండే స్థిరవిద్యుత్ శక్తి కారణంగా దుమ్ము రేగుతుందని పేర్కొంది. ఈ కణాల కారణంగా ఉత్పత్తయ్యే స్థిరవిద్యుత్ భవిష్యత్తులో ల్యాండర్లకు, మానవులకు ప్రమాదకరంగా మారవచ్చని ఈసా నివేదిక హెచ్చరించింది. భారత్ నిర్వహించిన చంద్రయాన్-2 లాగానే ఈసా కూడా చంద్రునిపైకి మానవరహిత మిషన్‌ను చేపట్టాలని యోచించింది. అయితే నిధుల లేమి కారణంగా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. ఆ సందర్భంగా చంద్రుని గురించి రూపొందించిన నివేదిక ఇటీవల మళ్లీ వెలుగులోకి వచ్చింది. కెనడా, జపాన్‌తో కలిసి 2020లో చంద్రుని దక్షిణ ధ్రువంపై హెరాకిల్స్ రోబోటిక్ మిషన్ చేపట్టేందుకు ఈసా ప్రయత్నిస్తున్నది.

5996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles