గగన్‌యాన్ వ్యోమగాముల బాధ్యత వాయుసేనకు!

Tue,February 12, 2019 02:24 AM

- 10 మంది ఎంపిక, శిక్షణ బాధ్యతల్ని అప్పగించిన ఇస్రో
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రతిష్ఠాత్మక తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)కు 10 మంది వ్యోమగాములను ఎంపిక చేసి, వారికి శిక్షణను అందించే బాధ్యతను భారత వాయుసేన (ఐఏఎఫ్)కు ఇస్రో అప్పగించింది. సభ్యుల ఎంపికలో అనుసరించాల్సిన విధి విధానాలు, అర్హతల వివరాల్ని ఇప్పటికే ఐఏఎఫ్‌కు సమర్పించినట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యోమగాముల ఎంపిక, శిక్షణ బాధ్యతలను ఐఏఎఫ్‌కు అప్పగించాం. తొలి దశ శిక్షణను బెంగళూరులోని ఐఏఎఫ్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం)లో నిర్వహిస్తాం. తుది దశ శిక్షణను మాత్రం విదేశాల్లో ఇప్పిస్తాం. గగన్‌యాన్ మిషన్ కోసం 10 మందిని వ్యోమగాముల్ని ఎంపిక చేసి శిక్షణను ఇవ్వాలని వాయుసేనను కోరాం. వీరిలో తుది దశలో ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసి అంతరిక్ష యాత్రకు పంపిస్తాం. వ్యోమగాములకు తుది దశ శిక్షణను మాత్రం రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఇప్పించాలనే ఆలోచనలో ఉన్నాం అని శివన్ వివరించారు. ఐఏఎంలో ఉన్న సిములేటర్స్ దేశంలో మరెక్కడా లేవని, అందుకే గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో.. ఈ సంస్థతో చేతులు కలిపిందని ఆయన చెప్పారు. జనవరి 30న ఇస్రో ప్రధాన కార్యాలయంలో మానవసహిత అంతరిక్ష కేంద్రం విభాగాన్ని ఇస్రో ప్రారంభించింది. గగన్‌యాన్ మిషన్‌ను పూర్తిగా ఈ కేంద్రమే పర్యవేక్షించనున్నది. మరోవైపు ఈ యాత్రలో ప్రాణనష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్త కోసం ఇస్రో తొలుత రెండు మానవరహిత (రోబో) అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు శివన్ చెప్పారు. 2020 డిసెంబర్‌లో తొలి మానవ రహిత అంతరిక్ష ప్రయోగాన్ని, 2021లో రెండో ప్రయోగాన్ని నిర్వహిస్తాం. ఆ తర్వాత 2021 డిసెంబర్‌లో తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపడతాం అని ఆయన వెల్లడించారు. గగన్‌యాన్ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.10వేల కోట్లు.

313
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles