ఉపగ్రహ శతకం! ఇస్రో జయహోSat,January 13, 2018 03:22 AM

వందో ఉపగ్రహం కార్టోశాట్ -2ఈ ప్రయోగం విజయవంతం
ఒక నానో, మరొక మైక్రో నానోతోపాటు
28 విదేశీ నానో ఉపగ్రహాలు కూడా
ఇస్రో చరిత్రలోనే సుదీర్ఘమైన ప్రయోగంగా నమోదు
శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
శాస్త్రవేత్తల సమిష్టి కృషితోనే ప్రయోగం సక్సెస్: సీఎం కేసీఆర్

సగర్వంగా భారతజాతి గొప్పతనాన్ని చాటి చెప్తూ.. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఉపగ్రహాల ప్రయోగంలో సెంచరీ కొట్టింది. తన వందో ఉపగ్రహం కార్టోశాట్-2ఈని శ్రీహరికోట నుంచి శుక్రవారం ఉదయం 9.28 గంటలకు విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతోపాటు 26 నానో, నాలుగు సూక్ష్మ ఉపగ్రహాలను వరుసగా కక్ష్యలో చేర్చింది. పీఎస్‌ఎల్వీ-40 విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. కార్టోశాట్-2ఈ ప్రయోగం విజయవంతం కావడం జాతికి నూతన సంవత్సర కానుక అని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు.
Rocket
శ్రీహరికోట, జనవరి 12: భారత జాతి జనులు గర్వంతో ఉప్పొంగేలా, విదేశాలు ఆశ్చర్యంతో చూసేలా అంతరిక్ష రంగంలో అద్భుత విజయాలను సాధిస్తున్న ఇస్రో మరో మైలురాయిని దాటింది. ఉపగ్రహాల ప్రయోగంలో సెంచరీని కొట్టింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి తన వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. కార్టోశాట్ 2ఈ తోపాటు మొత్తం 31 ఉపగ్రహాలను ఇస్రోకు ప్రీతిపాత్రమైన ఉపగ్రహ వాహక నౌక పీఎస్‌ఎల్‌వీ సీ 40.. ఉదయం 9.28 గంటలకు నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి మోసుకెళ్లింది. తద్వారా ఇస్రో తన శక్తి సామర్థ్యాలను, ప్రతిభా పాటవాన్ని, నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. కార్టోశాట్ 2ఈతోపాటు ఒక నానో, మరొక సూక్ష్మ ఉపగ్రహం ఆరు దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు ఉన్నాయి. 710 కిలోల బరువు గల కార్టోశాట్ 2ఈ ఉపగ్రహం.. నింగిలోకి ప్రయోగించిన 17 నిమిషాల్లోనే కక్ష్యలోకి ప్రవేశించింది. భారత్‌కు చెందిన నానో ఉపగ్రహంతోపాటు అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన 28 ఉపగ్రహాలు కేవలం ఏడు నిమిషాల్లో ఒకదాని తర్వాత మరొకటి కక్ష్యలోకి ప్రవేశించాయి. చివరిగా ఇస్రో సూక్ష్మ ఉపగ్రహం..105 నిమిషాలకు విజయవంతంగా కక్ష్యలో చేరింది. మొత్తం 2.15 గంటల్లో ప్రయోగం ముగిసిందని, ఇది సంస్థ చరిత్రలోనే సుదీర్ఘకాలం జరిగిన ప్రయోగం అని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇస్రో వందో ఉపగ్రహాన్ని ప్రయోగిస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఈ ప్రయోగాన్ని తిలకించాయి.

జాతికి నూతన సంవత్సర కానుక: ఏఎస్ కిరణ్‌కుమార్

కార్టోశాట్ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్ ఏ ఎస్ కిరణ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న కిరణ్ కుమార్.. ఇది జాతికి నూతన సంవత్సర కానుక అని అభివర్ణించారు. ఇస్రో నూతన చైర్మన్ శివన్‌కు అద్భుత విజయంతో స్వాగతం పలికామన్నారు. 2018లో ఉపగ్రహాల ప్రయోగంలో ఇస్రో శుభారంభాన్ని అందించింది. ఉపగ్రహాలన్నీ కక్ష్యలో ప్రవేశించాయి. కార్టోశాట్ 2 పనితీరు సంతృప్తికరంగా ఉన్నది అని చెప్పారు. ఇస్రో ప్రయోగించిన 100 ఉపగ్రహాల్లో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు రూపొందించినవీ ఉన్నాయని అన్నారు.
Rocket1

ప్రధాని మోదీ అభినందన

పీఎస్‌ఎల్‌వీ సీ 40 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో 100వ ఉపగ్రహం ప్రయోగం దాని అద్భుతమైన విజయాలకు, భవిష్యత్ ప్రయోగాల్లో ఉజ్వల భవిష్యత్‌కు సూచిక అని మోదీ ట్వీట్ చేశారు. ఇస్రోకు, ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడంలో శరవేగంగా ముందుకు వెళుతున్న ఇస్రో నూతన సంవత్సరంలో సాధించిన విజయంతో దేశ పౌరులు, రైతులు, మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుంది అని మరో ట్వీట్ చేశారు. ఇస్రో విజయం చరిత్రాత్మకమని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. పీఎస్‌ఎల్‌వీ సీ -40 ప్రయోగాన్ని విజయవంతం చేసి, చరిత్ర సృష్టించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభినందించారు.

సీఎం కేసీఆర్ అభినందనలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ 40 రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ విజయం శాస్త్రవేత్తల సమిష్టి కృషి, నిబద్ధతతకు నిదర్శనమని పేర్కొన్నారు. వారి నిరంతర కృషి, శాస్త్రీయ వికాసానికి నిలువుటద్దమని కొనియాడారు.

కార్టోశాట్ సిరీస్‌లో ఇది ఏడోది

ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహాల్లో కార్టోశాట్ 2 ఈ ఏడోది. దీని బరువు 710 కిలోలు. ఇందులో పాన్‌క్రోమాటిక్, మల్టీ స్పెక్టరల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో హై రిజొల్యూషన్‌తో కూడిన చిత్రాలను తీసి పంపేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఉపగ్రహంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికల అమలు, సముద్ర తీర ప్రాంతంలోని కోస్తాలో గల భూమి వినియోగం, రోడ్ నెట్‌వర్క్ పర్యవేక్షణ, నీటి పంపిణీ, భౌగోళిక సమాచార వ్యవస్థ తదితర అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. దేశ సరిహద్దుల్లో పొరుగు దేశాల జవాన్ల కదలికలను కనిపెట్టగల సామర్థ్యం కార్టోశాట్ 2ఈకి సొంతం.

562

More News

VIRAL NEWS