బ్రిటన్‌పై ఇరాన్‌ ప్రతీకారం


Sun,July 21, 2019 03:04 AM

Iran releases footage of seized British flagged oil tanker

-ఆ దేశానికి చెందిన ఇంధన నౌకను అదుపులోకి తీసుకున్న ఇరాన్‌
-18 మంది భారతీయులు సహా 23 మంది నిర్బంధం
-అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమన్న బ్రిటన్‌
-బందీలను విడిపించేందుకు ప్రయత్నిస్తున్న భారత్‌
-గల్ఫ్‌ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం

లండన్‌/టెహ్రాన్‌, జూలై 20: బ్రిటన్‌పై ఇరాన్‌ ప్రతీకారం తీర్చుకున్నది. శుక్రవారం హార్మూజ్‌ జలసంధి గుండా వెళ్తున్న బ్రిటన్‌ ఇంధన నౌకను అదుపులోకి తీసుకున్నది. బ్రిటన్‌ ఇటీవల తమ ఇంధన నౌకను సీజ్‌ చేసినందుకు ప్రతిగా బ్రిటన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను సీజ్‌ చేశామని స్పష్టం చేసింది. దీంతో ఇరాన్‌-బ్రిటన్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత వేడెక్కింది. తమ నౌకను విడిపించడానికి అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని బ్రిటన్‌ ప్రభుత్వం హెచ్చరించింది. ఇరాన్‌ అదుపులో ఉన్న నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 18 మంది భారతీయులే. స్వీడన్‌లోని ‘స్టెనా బల్క్‌' అనే కంపెనీకి చెందిన ‘స్టెనా ఇంపెరో’ అనే ఇంధన నౌక హార్మూజ్‌ జలసంధి మీదుగా సౌదీ అరేబియావైపు వెళ్తుండగా ఇరానియన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌ఎన్‌ఏ) బృందం అదుపులోకి తీసుకున్నది. ఇరాన్‌కు చెందిన మత్స్యకారుల బోటును ఢీకొట్టడంతోపాటు అంతర్జాతీయ జలరవాణా నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టెనా ఇంపెరోను అదుపులోకి తీసుకున్నారని ఇరాన్‌ అధికార న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొన్నది. ఈ చర్యను ఇరాన్‌ అత్యున్నత నిర్ణాయక కమిటీ ఇరాన్‌ గార్డియన్‌ కౌన్సిల్‌ ‘పరస్పర చర్య’గా అభివర్ణించింది. ‘పరస్పర చర్య నియమం అంతర్జాతీయ చట్టాల్లో ప్రముఖంగా ఉన్నది.

చట్టవిరుద్ధంగా విధించిన ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవడం, ఆయిల్‌ ట్యాంకర్లను సీజ్‌ చేయడం వంటివి ఇందులో భాగమే’ అని పేర్కొన్నారు. హార్ముజ్గన్‌ రాష్ట్ర పోర్టులు, సముద్ర వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అల్లాహ్‌మొరాద్‌ అఫిఫిపోర్‌ మాట్లాడుతూ ‘బ్రిటిష్‌ జెండాతో వెళ్తున్న ఈ నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో నౌక కెప్టెన్‌ సహా 18 మంది భారతీయులు. మిగతావారిలో రష్యా, ఫిలిప్పీన్స్‌, లాత్వియా తదితర దేశాలకు చెందినవారు ఉన్నారు’ అని తెలిపారు. ప్రమాదానికి ముందు మత్స్యకారుల బోటు కెప్టెన్‌ బ్రిటన్‌ ఇంధన నౌక కెప్టెన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించారని, అయితే సిగ్నల్‌ లేకపోవడంతో వీలు కాలేదన్నారు. స్టెనా బల్క్‌ సంస్థ అధిపతి ఎరిక్‌ హానెల్ల్‌ మాట్లాడుతూ సిబ్బందిని క్షేమంగా విడిపించడంపైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు బ్రిటన్‌, స్వీడన్‌ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్న ట్టు చెప్పారు. ‘మా నౌక హార్మూజ్‌ జలసంధిలో వెళ్తుండగా హెలికాప్టర్‌, కొన్ని బోట్లు అడ్డుకున్నాయి. తర్వాత నౌక దిశ మారింది. జుబేయిల్‌ పోర్ట్‌కు వెళ్లాల్సిన నౌక.. దక్షిణ ఇరాన్‌ వైపు వెళ్లింది’ అని వివరించారు.

ఇరాన్‌ది దుస్సాహసం

ఇరాన్‌ చర్యను యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌ ఖండించాయి. ఇరాన్‌ దుస్సాహసానికి ఒడిగట్టిందని, వెంటనే సరిదిద్దుకోవాలని యూకే ప్రభుత్వం హెచ్చరించింది. బ్రిటన్‌ దిగువ సభ విదేశాంగ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు టామ్‌ టగెందట్‌ ఇరాన్‌ చర్యపై తీవ్రంగా స్పందించారు. నౌకను విడిపించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని చెప్పారు. భారతీయులను విడిపించేందుకు ఇరాన్‌ సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగశాఖ తెలిపింది.

దెబ్బకు దెబ్బ

ఈ నెల ప్రారంభంలో 20 లక్షల బ్యారళ్ల చమురుతో వెళ్తున్న ఇరాన్‌ నౌకను స్పెయిన్‌ సమీపంలోని ఐబీరియన్‌ ద్వీపం ప్రాంతంలో బ్రిటన్‌ నౌకాదళ సిబ్బంది, జిబ్రాల్టర్‌ పోలీసులు అడ్డుకున్నారు. యురోపియన్‌ యూనియన్‌ విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ సిరియాకు చమురును సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 4వ తేదీన ఆ నౌకను అదుపులోకి తీసుకున్నారు. అమెరికా ఆదేశాల మేరకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం జిబ్రాల్టర్‌ కోర్టు ఇరాన్‌ నౌక నిర్బంధాన్ని మరో 30 రోజులు పొడిగించింది. దీనికి ప్రతీకారంగా బ్రిటన్‌ నౌకను ఇరాన్‌ సీజ్‌ చేసింది.

969
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles