మైనర్ భార్యతో శృంగారం లైంగికదాడే!Thu,October 12, 2017 02:55 AM

కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు

minor-wife
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మరో కీలక తీర్పును వెలువరించింది. మైనర్ భార్యతో లైంగికచర్యను రేప్‌గానే పరిగణించాలని నిర్ణయించింది. 15 నుంచి 18 ఏండ్లలోపు వయసున్న భార్య అంగీకరించినప్పటికీ అమెతో జరిపే శృంగారాన్ని లైంగికదాడిగానే భావించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బాల్యవివాహాల నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చినట్లు తెలుస్తున్నది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375పై సవివరణాత్మక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. సెక్షన్ 375 ప్రకారం.. ఓ వ్యక్తి 18 ఏండ్ల కన్నా తక్కువ వయసున్న బాలికతో లైంగికచర్యలో పాల్గొనడం నేరం. బాలిక సమ్మతించినా దీనిని నేరంగానే పరిగణిస్తారు. అయితే సదరు బాలిక అతడి భార్య అయ్యి, ఆమె వయసు 15 ఏండ్లు మించితే ఈ చట్టం నుంచి ఇప్పటివరకు మినహాయింపు ఉండేది. 15 నుంచి 18 ఏండ్లలోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యాంగబద్ధం కాదని జస్టిస్‌లు మదన్ బీ లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా స్పష్టంచేసింది.

ఈ మినహాయింపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నది. దేశంలో జరుగుతున్న బాల్యవివాహాలపై ఆందోళన వ్యక్తంచేసిన ధర్మాసనం, సామాజిక న్యాయచట్టాల రూపకల్పనలోని ఉద్దేశం నీరుగారుతున్నదని వ్యాఖ్యానించింది. 15-18 ఏండ్ల లోపు వయసున్న వివాహితను సెక్షన్ 375 నుంచి మినహాయించడంపై ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బెంచ్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బాల్యవివాహమే చట్టవ్యతిరేకమైనప్పుడు 15నుంచి 18 ఏండ్ల లోపు బాలికలపై కాపురం పేరుతో లైంగికచర్యకు పాల్పడటం చట్టబద్ధమెలా అవుతుందని పిటిషనర్ ప్రశ్నించారు. దీనిని విచారించిన ధర్మాసనం బుధవారం తీర్పు వెల్లడించింది. 18 ఏండ్లలోపు వారందరూ మైనర్లేనని, వారిపై జరిపే లైంగికచర్యను నేరంగానే పరిగణించాలని తెలిపింది. బాల్య వివాహాలను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ధర్మాసనం తీర్పుతో ఏకీభవిస్తూనే జస్టిస్ దీపక్ గుప్తా తన తీర్పును ప్రత్యేకంగా రాశారు. 18ఏండ్లు కనీస వైవాహిక వయసుగా అన్ని చట్టాలు చెబుతున్నప్పుడు, సెక్షన్ 375 ఇచ్చే మినహాయింపు బాలికల హక్కులను కాలరాస్తూ.. మోజుకొద్దీ ఇచ్చిన హేతుబద్ధత లేని మినహాయింపుగా జస్టిస్ గుప్తా అభిప్రాయపడ్డారు.

1691

More News

VIRAL NEWS