మతాంతర వివాహాలతో సమసమాజం


Thu,September 12, 2019 03:01 AM

Inter Religious and Inter Caste Marriages are Good for Socialism Not Averse to Them Supreme Court

- వాటికి మేం వ్యతిరేకం కాదు
- హిందూ-ముస్లిం జంట వివాహం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
- గొప్ప ప్రేమికుడిగా ఉండాలని భర్తకు హితవు


న్యూఢిల్లీ: మతాంతర, కులాంతర వివాహాల కు తాము వ్యతిరేకంకాదని, ఇలాంటి పెండ్లిళ్లు సోషలిజానికి (సమసమాజానికి) తోడ్పడుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కొంతమంది దురుద్దేశంతో ఇలాంటి పెండ్లిళ్లు చేసుకుని, ఆ తర్వాత భార్యను వదిలేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఓ మతాంతర వివాహానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మతాంతర వివాహాలకు మేం వ్యతిరేకం కాదు. హిందూ-ముస్లిం వివాహాలూ సమ్మతమే. చట్ట ప్రకారం వారు పెండ్లి చేసుకుంటే, సమస్యలు ఎందుకొస్తాయి? అని జస్టిస్‌లు అరుణ్ మిశ్రా, ఎంఆర్ మిశ్రాతోకూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక ముస్లిం యువకుడు(33) గతేడాది హిందూ యువతిని (23) పెండ్లి చేసుకున్నాడు. ఇందుకోసం అతడు హిందూ మతాన్ని స్వీకరించాడు. అయితే పెండ్లి తర్వాత అతడు తిరిగి ఇస్లాం స్వీకరించాడని యువతి తండ్రి ఆరోపించారు. ఇదంతా కుట్ర అని, మతాంతర వివాహాల ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దంపతులిద్దరూ కలిసి ఉండేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

అమ్మాయి తండ్రి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మతాంతర పెండ్లి ముసుగులో ఒక రాకెట్ నడుస్తున్నదని, దీనిపై సుప్రీంకోర్టు దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని కోరారు. యువకుడి తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, యువ తి తరఫున గోపాల్ శంకర్‌నారాయణ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో విచారణ అవసరం లేదని పేర్కొంటూ కేరళకు చెందిన హదియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. తాము ఈ పెండ్లిపై విచారణ చేయదలచుకోలేదని, కేవలం యువతి ప్రయోజనాలను కాపాడాలనుకుంటున్నామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా యువకుడిని మంచి భర్తగా, గొప్ప ప్రేమికుడిగా ఉండాలని సూచించింది. పెండ్లి అనంతరం చట్టప్రకారం పేరు మార్చుకున్నారా? అని ప్రశ్నించింది. కేసుపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరుతూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.

భాగవత్ కాన్వాయ్ వాహనం ఢీకొని బాలుడు మృతి

జైపూర్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఆరెస్సెస్ అధిపతి మోహన్ భాగవత్ కాన్వాయ్‌కు చెందిన ఒక కారు.. బైక్‌ను ఢీకొనడంతో ఆరేండ్ల బాలుడు మృతిచెందాడు. అతడి తాత తీవ్రంగా గాయపడ్డాడు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన భాగవత్.. తిజారా ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు దర్యాప్తులో ఉన్నది.

249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles