మళ్లీ ఆమే..!


Thu,January 10, 2019 02:51 AM

Indira Sawhney again to challenge EBC Quota in Supreme court

-ఈబీసీ కోటాను కోర్టులో సవాలు చేస్తానన్న ఇందిరా సాహ్నీ
-పీవీ హయాంలో ఇదే తరహా ప్రయత్నాన్ని అడ్డుకున్న న్యాయవాది

న్యూఢిల్లీ, జనవరి 9: అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ ప్రభుత్వం తేనున్న చట్టం చెల్లుబాటవుతుందా? లేదా? ప్రస్తుతం దేశమంతా ఇదే చర్చ జరుగుతున్నది. కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా, మరికొందరు ఈ బిల్లు కోర్టులో వీగిపోతుందని అంటున్నారు. పార్లమెంట్‌లోని ఉభయ సభలో బిల్లుపై చర్చ జరిగినప్పుడు దాదాపు అన్ని పార్టీలు ఈ మద్దతు తెలిపాయి. దీంతో ఈ బిల్లును కోర్టులో ఎవరు సవాలు చేయనున్నారన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా నెలకొంది. ఇంతకుముందు 1992లో అగ్రకులాల వారికి రిజర్వేషన్ కల్పించేందుకు పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కోర్టు ద్వారా అడ్డుకున్న సీనియర్ న్యాయవాది ఇందిరా సాహ్నీ మోదీ సర్కార్ నిర్ణయాన్ని కూడా సవాలు చేస్తామని చెప్పారు. ఓ వార్తా సంస్థతో బుధవారం ఇందిరా సాహ్నీ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు వల్ల జనరల్ క్యాటగిరీలో అర్హులైన అభ్యర్థులు అవకాశాలను కోల్పోతారని చెప్పారు. అందుకనే ఈ బిల్లును కోర్టులో సవాలు చేస్తామని ఆమె చెప్పారు. బిల్లుపై పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.

ప్రస్తుత బిల్లు వల్ల రిజర్వేషన్లు 60 శాతానికి పెరుగుతాయని, ఫలితంగా ఓపెన్ క్యాటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీనిని కోర్టు కొట్టి వేసే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో తాను పీవీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించేందుకు దారితీసిన పరిస్థితులను ఇందిర గుర్తు చేసుకున్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ కల్పించాలన్న పీవీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జండేవాలన్ వద్ద జరిగిన ఒక ప్రదర్శనలో స్కూలు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారని, అది చూసి రెండు రోజుల్లోనే పిటిషన్ వేశానని చెప్పారు. ఆ కేసు అనేక ధర్మాసనాలను దాటుకుంటూ రాగా, చివరికి జస్టిస్ వెంకటాచలయ్య నేతృత్వంలోని 9మంది సభ్యుల ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను రిజర్వు చేస్తూ పీవీ తప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు.

777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles