నింగికెగిరిన ‘మహా విహంగం’


Thu,December 6, 2018 02:55 AM

Indias Most Powerful Satellite The Big Bird Launched Successfully

-విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించిన జీశాట్-11
-ఫ్రెంచ్ గయానా నుంచి బుధవారం తెల్లవారు జామున ప్రయోగం
-ఇస్రో చరిత్రలో అత్యంత భారీ, శక్తిమంతమైన ఉపగ్రహం ఇదే
-భారత్‌లోని అణువణువుకూ ఇంటర్నెట్ సేవల పరిధిని విస్తరించనున్న శాటిలైట్

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే అత్యంత భారీ, శక్తిమంతమైన ఉపగ్రహంగా పిలువబడుతున్న జీశాట్-11 ప్రయో గం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.07 గంటలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరో అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి జీశాట్-11ను ప్రయోగించారు. యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏరియన్-5(వీఏ246) అంతరిక్ష వాహకనౌక జీశాట్-11ను తీసుకుని నింగికెగిరింది. 33నిమిషాల ప్రయాణం తర్వాత భూమికి 36వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న ఏరియన్-5.. దీర్ఘవృత్తాకార భూమ్యానువర్తన పరివర్తన కక్ష్యలోకి.. దాని నుంచి భూస్థిర కక్ష్యలోకి జీశాట్-11ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో ఇప్పటివరకు తయారు చేసిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే. రూ.600 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ జీశాట్-11 బరువు 5,854 కిలోలు. జీశాట్-11 ఉపగ్రహ సామర్థ్యం.. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన అన్ని కమ్యూనికేషన్ శాటిలైట్ల సామర్థ్యంతో సమానం. భారత్‌లోని అణువణువునూ ఇది ఇంటర్నెట్ పరిధిలోకి తీసుకురానున్నది. మారుమూల ప్రాంతాలకు ఉపగ్రహ ఆధారిత అంతర్జాల సేవలను ఇది అందించనుంది. 15ఏండ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. మరోవైపు జీశాట్-11 ప్రయోగం విజయవంతంపై ప్రధాని నరేంద్ర మోదీ భారత శాస్త్రవేత్తలను అభినందించారు.

జీశాట్-11 ప్రత్యేకతలెన్నో..

భారత్ ఇప్పటివరకు ప్రయోగించిన ఉప్రగహాలతో పోల్చితే జీశాట్-11లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కమ్యూనికేషన్ రంగంలో భారీ ఉపగ్రహాలు శక్తిమంతమైనవే కాకుండా, సుదీర్ఘకాలం సేవలందిస్తాయి. జీశాట్-11 కూడా అలాంటిదే. ఇప్పటిదాకా అత్యధిక బ్యాండ్‌విడ్త్‌ను వెంట తీసుకెళ్లిన ఉపగ్రహం కూడా ఇదే. ఇందులో కేయూ-బ్యాండ్, కేఏ-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో పనిచేసే 40 ట్రాన్స్‌పాండర్లు అమర్చారు. అవి సెకనుకు 16 జీబీ వేగంతో డాటాను సరఫరా చేయడంతోపాటు హైబ్యాండ్ విడ్త్‌తో కూడిన కనెక్టివిటీని అందిస్తాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ మరింత సులువుగా, విస్తారంగా అందుబాటులోకి వస్తుంది. విమానాల్లోనూ ఇంటర్నెట్ సేవలను పొందేందుకు వీలవుతుంది. బరువులోనే కాదు, ఆకారంలోనూ ఇది భారీ విహంగమే. దీనికి అమర్చిన సౌర ఫలకాలు (సోలార్ ప్యానెళ్లు).. సెడాన్ కారు కంటే పెద్దగా.. ఒక్కొక్కటి నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడువైనవి. ఇన్‌శాట్ లాంటి సంప్రదాయ శాటిలైట్లు ఉపయోగించే సిగ్నల్ బీమ్ యావత్ దేశాన్ని కవర్ చేసేందుకు సరిపోవు. కానీ, జీశాట్-11 ప్రధానంగా ఒక భౌగోళిక ప్రాంతంపైనే కేంద్రీకృతమవుతుంది కాబట్టి.. వేగవంతంగా డేటాను సరఫరా చేస్తుంది.

గ్రామాల్లో ఈ-గవర్నెన్స్‌కు అనువైన డేటాను ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఫైబర్ ఆప్టికల్ ద్వారా ఇంటర్నెట్ అందించడానికి వీల్లేని ప్రాంతాల్లోనూ ఈ ఉపగ్రహం సాయ ంతో సేవలను పొందవచ్చు. అంతేకాకుండా ఫైబర్ ఆప్టికల్ ఆధారిత వ్యవస్థలో సమస్యలు తలెత్తినప్పుడు.. పూర్తిగా ఇంటర్నెట్ నిలిచిపోకుండా జీశాట్-11 సాయంతో నడిపించే వీలున్నది. ముఖ్యంగా మల్టీస్పాట్ బీమ్ కవరేజ్‌ను అందించేందుకు ఉపయోగపడుతుంది అని శాస్త్రవేత్తలు వివరించారు. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్వీ మార్క్-3 శ్రేణి రాకెట్ గరిష్ఠంగా 4 టన్నుల బరువును మాత్రమే మోసుకెళ్లగలదు. దాదాపు ఆరుటన్నుల బరువున్న ఉపగ్రహాన్ని అది తీసుకెళ్లలేనందున.. శక్తిమంతమైన ఏరియన్-5 రాకెట్‌ను అద్దెకు తీసుకుని జీశాట్-11ను ఇస్రో ప్రయోగించింది.

తొలి భారతీయ ప్రైవేట్ ఉపగ్రహం.. ఎక్సీడ్ శాట్-1

భారత్‌లో తొలి ప్రైవేటురంగం నుంచి తయారైన వాణిజ్య ఉపగ్రహంగా ఎక్సీడ్ శాట్-1 నిలిచింది. ముంబయికి చెందిన ప్రైవేట్ స్టార్టప్ సంస్థ ఎక్సీడ్ స్పేస్ ఈ ఉపగ్రహాన్ని 18నెలల్లో రూపొందించింది. దీనితోపాటు వివిధ దేశాలకు చెందిన 63 ఉపగ్రహాలను తీసుకుని ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్.. మంగళవారం తెల్లవా రుజామున నింగిలోకి దూసుకెళ్లింది. ఎక్సీడ్ శాట్-1ను నిర్దేశిత ధ్రువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో భారత్‌లో సొంత ఉపగ్రహాన్ని కలిగిన ఏకైక ప్రైవేటు వాణిజ్య సంస్థగా ఎక్సీడ్ స్పేస్ నిలిచింది. ఈ స్టార్టప్ కంపెనీ చంద్రుడిపైకి మానవుడిని పంపేలక్ష్యంతో ప్రయోగాలు చేస్తున్నది. పరిమాణంలో ఓ కాఫీ మగ్ సైజులో ఉండే ఎక్సీడ్ శాట్-1 బరువు ఒక కిలో మాత్రమే. ప్రతిరోజూ ఐదారు సార్లు భూమిమీదుగా తిరుగాడనున్న ఈ ఉపగ్రహం.. అమెచ్యూర్ రేడియో కమ్యూనిటీకి సేవలందించనున్నది. టీవీ ట్యూనర్ సహాయంతో 145.9 మెగాహెర్ట్ ఫ్రీక్వెన్సీపై ఎక్సీడ్ శాట్-1 ఉపగ్రహం నుంచి సిగ్నల్స్ అందుకోవచ్చు.

1169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles