వాట్సాప్ ద్వారా క్రిమినల్ కేసు విచారణ!


Mon,September 10, 2018 01:35 AM

Indian SC blasts lower court for WhatsApp order

-హజారీబాగ్ కోర్టు నిర్వాకానికి నిర్ఘాంతపోయిన సుప్రీంకోర్టు
-న్యాయవిచారణ మీకు జోక్‌లా ఉందా? అని ధర్మాసనం ఆగ్రహం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సామాజిక మాధ్యమం వాట్సాప్ ద్వారా ఓ క్రిమినల్ కేసును విచారించిన ఉదంతం గురించి మీరెప్పుడైనా విన్నారా? జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ కోర్టు జరిపిన ఈ విచారణ గురించి తెలిసి ఏకంగా సుప్రీంకోర్టే నిర్ఘాంతపోయింది. భారత న్యాయవ్యవస్థకే తలవంపులు తెచ్చే ఇలాంటి చోద్యాన్ని ఎలా అనుమతించారని సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తంచేసింది. వివరాల్లోకెళ్తే.. రెండేండ్ల క్రితం జరిగిన అల్లర్లలో నిందితులుగా ఉన్న జార్ఘండ్ మంత్రి యోగేంద్ర సావో, ఆయన భార్య, శాసనసభ్యురాలు నిర్మలాదేవిపై హజారీబాగ్‌లోని దిగువకోర్టు న్యాయమూర్తి ఈ ఏడాది ఏప్రిల్ 19న వాట్సాప్ కాల్ ద్వారా విచారణ జరిపారు. వారిపై అభియోగాల నమోదుకు పోలీసులను ఆదేశించారు. అయితే తమ అభ్యంతరాలను పట్టించుకో కుండానే దిగువ కోర్టు న్యాయమూర్తి వాట్సాప్ కాల్ ద్వారా విచారణ జరిపారని ఇద్దరు నిందితులు సుప్రీంకోర్టుకు తెలిపారు.

దీంతో జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఎల్‌ఎన్ రావుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. జార్ఖండ్‌లో అసలు ఏమి జరుగుతున్నదని ప్రశ్నించింది. వాట్సాప్ ద్వారా కేసును విచారించడం పెద్ద జోక్‌లా ఉన్నదని ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ఇటువంటి చోద్యాలను అనుమతించరాదని జార్ఖండ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టంచేసింది. తమ కేసులను హజారీబాగ్ నుంచి న్యూఢిల్లీకి బదిలీచేయాలంటూ యోగేంద్ర దంపతులు చేసుకున్న విజ్ఞప్తిపై రెండువారాల్లోగా సమాధానమివ్వాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

762
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS