-గత పదేండ్లలో ఇదే అధ్వానం.. కాగ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: రైల్వేల నిర్వహణ నిష్పత్తి (ఆదాయ, వ్యయాల నిష్పత్తి) 2017-18లో 98.44%గా నమోదైందని, గత 10 ఏండ్లలో ఇదే అధ్వానమని కాగ్ విమర్శించింది. కాగ్ నివేదికను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. రైల్వే ఎంత సమర్థంగా పనిచేస్తున్నది, దాని ఆర్థిక పరిస్థితి ఏవిధంగా ఉన్నది అనేది నిర్వహణ నిష్పత్తి ద్వారా తెలుస్తుంది. ఇది 98.44%గా ఉన్నదంటే రూ.100 ఆదాయం కోసం రూ.98.44 వ్యయం చేసినట్టు. గతంలో 2000-01లో నిర్వహణ నిష్పత్తి అత్యంత తక్కువగా 98.3%గా రికార్డు కాగా, ఆ మరుసటి ఏడాది 96 శాతానికి పుంజుకున్నది. ప్యాసింజర్ సర్వీసెస్, ఇతర కోచింగ్ సర్వీసెస్ నిర్వహణ వ్యయాలను రైల్వే అందుకోలేకపోతున్నదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. సరకు రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 95 శాతాన్ని ప్యాసింజర్ సర్వీసెస్ వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకే వెచ్చిస్తున్నట్లు తెలిపింది. రాయితీ టికెట్లు/పాస్‌లు, ప్రివిలేజ్ టికెట్ ఆర్డర్స్ (పీటీవోలు) రైల్వే నష్టాలకు ఒక కారణంగా తెలిపింది. రాయితీ వదులుకునేందుకు 2017లో ప్రభుత్వం ప్రారంభించిన గివ్ అప్ పథకానికి సీనియర్ సిటిజన్ల నుంచి స్పందన ఆశాజనకంగా లేదని కాగ్ పేర్కొంది. మరోవైపు, ఏసీ తరగతుల్లో ప్రయాణించే అన్ని క్యాటగిరీల రాయితీలకు చెందిన ప్రయాణికుల వార్షిక పెరుగుదల రేటు నాన్ ఏసీ క్లాస్‌ల కంటే అధికంగా ఉన్నట్లు తెలిపింది. వెంటనే ఆదాయాన్ని పెంచుకునే చర్యలు చేపట్టాలని సూచించింది.