- భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన పొరుగుదేశపు నౌక
- గూఢచర్యానికి వచ్చినట్టు అనుమానాలు
- నౌకాదళం హెచ్చరికతో తోకముడిచిన చైనా నౌక
న్యూఢిల్లీ: భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన చైనా నౌకను మన నౌకా దళం తరిమికొట్టింది. ఈ సంగతి నౌకా దళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ మంగళవారం తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులలో ఈ ఘటన గత సెప్టెంబర్‌లో జరిగిందన్నారు కానీ వివరాలు వెల్లడించలేదు. అండమాన్‌కు సమీ పాన భారత్ ప్రత్యేక ఆర్థిక జోన్లోకి చైనా పరిశోధన నౌక ‘షీ యాన్ 1’ ప్రవేశించినట్లు సైనిక వర్గాల సమాచారం. ఆ నౌక గూఢచర్యానికి పాల్పడుతున్నదని భారత నౌకాదళం అనుమానించింది. మన నౌకాదళం అనుమతి లేకుండానే అది మన జలాల్లోకి ప్రవేశించిందన్నాయి. తొలుత చైనా నౌకను భారత నౌకా దళ నిఘా విమానం పసిగట్టిందని తెలిపాయి.
వెంటనే అక్కడ పరిస్థితి అంచనా వేసేందుకు నౌకాదళం ఒక యుద్ధ నౌకను అక్కడికి పం పిందన్నాయి. భారత్ ప్రత్యేక ఆర్థిక జోన్లో విదేశాల నౌకలు పరిశోధన/ అన్వేషణ సాగించడం నిషిద్ధం. అందువల్ల చైనా నౌకను మన జలాల్లోంచి వెళ్లిపోవాలని భారత యుద్ధ నౌక హెచ్చరించింది. దీంతో చైనా నౌక వెళ్లిపోయిందని సైనిక వర్గా లు పేర్కొన్నాయి. అడ్మిరల్ కరంబీర్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, మన సముద్ర జలాల్లో ఎవరైనా, ఏమైనా చేయాలనుకుంటే ముందుగా మనకు తెలియజేసి, మన అనుమతి తీసుకోవాలన్నది మన వైఖరి అని చెప్పారు. హిందూ మహాసముద్రంలో ఏడెనిమిది చైనా నౌకలు ఎప్పుడూ మోహరించి ఉంటాయని తెలిపారు. హిందూ మహాసముద్రంలో పాకిస్థాన్ కుయుక్తులపై కూడా తమకు అవగాహన ఉన్నదని కరంబీర్ చెప్పారు.