జాదవ్ కేసులో పునర్విచారణకు పాక్ పిటిషన్Sat,May 20, 2017 02:05 AM

kulbushan
న్యూఢిల్లీ, మే 19: కుల్‌భూషణ్‌జాదవ్ కేసుపై పునర్విచారణ జరుపాల్సిందిగా కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్థాన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆరువారాల్లోగా పునర్విచారణను పూర్తిచేయాలని కూడా కోర్టును పాక్ కోరడం గమనార్హం. న్యాయవాది కవర్ ఖురేషి పాక్ తరఫున వాదిస్తారని తెలుస్తున్నది. ఈ కేసులో పాక్ సర్కారు అసమర్థంగా వ్యవహరించిందని పాక్ విపక్షాలు, న్యాయనిపుణులు, మీడియా దుయ్యబడుతున్నాయి. పాక్ వినియోగించిన న్యాయవాదులకు ఇలాంటి కేసుల్లో వాదించిన అనుభవం లేదని, అసలు పాక్ ఐసీజే కేసుకు స్పందించకుండా ఉంటే సరిపోయేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌కు అమ్ముడుపోయారని, ఐసీజే తీర్పు పాక్‌కు చెంపపెట్టు అని విమర్శలు గుప్పిస్తున్నారు. కొత్త బృందం పాక్ వాదనను ముందుకు తెస్తుందని పాక్ ప్రధాని విదేశాంగ సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఐసీజే తీర్పు ప్రభావం కుల్‌భూషణ్‌పై పాక్‌లో జరుగుతున్న విచారణపై ప్రభావం చూపబోదని అన్నారు.

-పాక్ సర్కారుపై విపక్షాల మండిపాటు
-కుల్‌భూషణ్ కేసులో ఓటమిపై విమర్శలు
-కొత్త లాయర్ల బృందం నియామకం?

పాక్ మీడియా వింతభాష్యాలు
ఐసీజేలో భారత్‌కు విస్పష్ట విజయం లభించినప్పటికీ పాక్ మీడియా మాత్రం మరోరకంగా వ్యాఖ్యానిస్తున్నది. పాక్‌లో అమాయకుల మృతికి కారకుడైన వ్యక్తి కేసులో మానవీయ కోణాలు జొప్పించాలని ఇండియా చూస్తున్నదని నేషన్ పేర్కొన్నది. ఐసీజే రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఇండియా మేనేజ్ చేసిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక రాసింది. పాకిస్థాన్ టుడే పత్రిక మాత్రం ఐసీజే తీర్పును పాకిస్థాన్ గౌరవించాలని, తీర్పును సవాల్ చేసేందుకు మెరికల్లాంటి న్యాయవాదులను నియమించాలని సూచించింది.

అప్పుడే గెలిచినట్టు కాదు
కుల్‌భూషణ్ కేసులో విజయం సాధించినట్టు అప్పడే సంబరాలు జరుపుకోవడం సరికాదని గతంలో సరబ్‌జిత్ తరఫున వాదించిన పాక్ న్యాయవాది అవేస్ షేఖ్ హెచ్చరించారు. భారత్ గూఢచారిగా ముద్రవేసి శిక్ష వేసిన సరబ్‌జిత్‌కు కోర్టులో ప్రాతినిధ్యం వహించినందుకు షేఖ్ పాకిస్థాన్‌లో వేధింపులు, చిత్రహింసలు అనుభవించారు. చివరకు దేశాన్ని విడిచిస్వీడన్‌లో స్థిరపడ్డారు. కుల్‌భూషణ్‌ను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఆచితూచి అడుగులు వేయాలన్నారు.

కుల్‌భూషణ్ అప్పీల్ చేశారా?
అంతర్జాతీయ న్యాయస్థానంలో సానుకూల తీర్పు వచ్చినప్పటికీ కుల్‌భూషణ్ పాక్ నిబంధనల ప్రకారం మరణశిక్షపై అప్పీల్ చేసుకున్నారా అనేది తెలియరాలేదు. ఇందుకు ఉద్దేశించిన 40 రోజుల గడువు శుక్రవారంతో ముగిసింది. కుల్‌భూషణ్ తల్లి సమర్పించుకున్న అప్పీల్‌ను పాక్ సైనిక న్యాయస్థానం పరిశీలనకు స్వీకరించిందీ లేనిదీ తెలియరాలేదు.

363

More News

VIRAL NEWS