భారత్‌ చేతికి.. స్విస్‌ ఖాతాల జాబితా!

Tue,October 8, 2019 02:29 AM

- ఒప్పందంలో భాగంగా తొలి విడుత వివరాలు అందజేసిన స్విట్జర్లాండ్‌


న్యూఢిల్లీ/బెర్న్‌: దేశంలోని నల్ల కుబేరుల గుండెల్లో దడ మొదలైంది. స్విస్‌ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న భారతీయుల ఖాతాల వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే విధానం (ఏఈవోఐ) కింద స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ) తొలి విడుత సమాచారాన్ని భారత్‌కు అందజేసింది. ఆగస్టులో ఢిల్లీకి వచ్చిన ఎఫ్‌టీఏ అధికారులు ఈ వివరాలను కేంద్రానికి ఇచ్చినట్టు సమాచారం. ఆ దేశం నుంచి తొలిసారిగా అందిన వివరాల్లో 2018లో భారతీయ ఖాతాదారులు జరిపిన లావాదేవీలతోపాటు ఖాతాల మూసివేతకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఖాతాదారుని పేరు, చిరునామా, ఖాతాలోని నగదుకు సంబంధించిన వివరాలను అందజేసినట్టు ఎఫ్‌టీఏ అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే సమాచారాన్ని రహస్యంగా ఉంచాలన్న నిబంధన ఉండటంతో ఒక వ్యక్తి లేదా సంస్థకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి, వాటిల్లో కలిపి మొత్తం ఎంత నగదు ఉన్నది అన్న వివరాలు వెల్లడించబోమని ఆయన చెప్పారు.

నల్లధనం దాచుకునేందుకు స్విస్‌ బ్యాంకులు స్వర్గధామంగా మారాయన్న ఆరోపణల నుంచి బయటపడేందుకు 2017లో ఆ దేశం చర్యలు చేపట్టింది. నల్ల ధనం వెలికితీత కోసం భారత్‌తోసహా 75 దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. కాగా స్విట్జర్లాండ్‌ నుంచి భారత్‌కు అందిన తొలి విడుత వివరాల్లో ఎక్కువగా ప్రవాస భారతీయుల వివరాలు ఉన్నట్టు సమాచారం. తమ నల్లధనం గుట్టు బయటపడుతుందన్న భయంతో 2018లో సుమారు వంద మంది భారతీయులు స్విస్‌లోని తమ పాత బ్యాంకు ఖాతాలను మూసిన వివరాలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. తదుపరి విడుత వివరాలను 2020 సెప్టెంబర్‌లో అందజేయనున్నట్టు ఎఫ్‌టీఏ అధికారి తెలిపారు.

322
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles