భారతీయుల్లో ఆనందం ఆవిరి


Thu,March 21, 2019 02:19 AM

India ranks 140th in global list of happiest nations

-సంతోషంగా ఉన్న ప్రపంచ దేశాలలో మనది 140వ స్థానం
-మనకన్నా పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఎంతో మెరుగు
-మొదటి స్థానంలో ఫిన్‌లాండ్, చివరి స్థానంలో సూడాన్

ఐరాస, మార్చి 20: సంతోషం సగం బలం అన్నారు. కానీ భారతీయులు గత ఏడాది ఉన్నంత సంతోషంగా ఈ ఏడాది లేరని ఐక్యరాజ్యసమితి తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే భారతీయులలో సంతోషం మరింత తగ్గిందని పేర్కొంది. ఐరాస మార్చి 20వ తేదీని ప్రపంచ సంతోష దినంగా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఈ సంవత్సరపు ప్రపంచ సంతోషం నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. కాగా గత ఏడాది 133వ స్థానంలో భారత్ ఈ ఏడాది 140వ స్థానానికి పడిపోయింది. ప్రజల శ్రేయస్సును సూచించే ఆదాయం, స్వేచ్ఛ, నమ్మకం, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం, సామాజిక మద్దతు, ఉదారత ఆధారంగా ఆయా దేశాలకు ర్యాంకులు కేటాయిస్తారు. గత కొన్నేండ్లుగా ప్రపంచవ్యాప్తంగా సంతోషం స్థాయి తగ్గుతున్నదని ఆ నివేదిక వెల్లడించింది.

భారత్‌లో ఈ తగ్గుదల స్థిరంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రజల్లో ప్రతికూల భావాలు, చింత, విచారం, కోపం పెరుగుతున్నదని తెలిపింది. ఆయా దేశాల పౌరులు ఎంత సంతోషంగా ఉన్నారన్న అంశం ఆదారంగా 156 దేశాలకు ఐరాస ర్యాంకులు కేటాయిస్తుంది. ఫిన్‌లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. ఆ తరువాత వరుసగా డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో పాకిస్థాన్ 67వ స్థానంలో ఉండగా, చైనా 93, బంగ్లాదేశ్ 125వ స్థానంలో ఉన్నాయి. యుద్ధంతో చిన్నాభిన్నమైన సూడాన్ వాసులు అత్యంత దుఃఖంలో ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో చివరగా సూడాన్ (156) ఉండగా, దానికన్నా ముందు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (155), ఆఫ్ఘనిస్థాన్ (154), టాంజానియా (153), రువాండా (152) ఉన్నాయి.

902
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles