మళ్లీ మోదీ


Fri,May 24, 2019 03:19 AM

India Prime Minister Again Narendra Modi

-నరేంద్రుడి నాయకత్వానికి జనం నీరాజనం
-వరుసగా రెండోసారి ప్రధాని పీఠంపై మోదీ
-బలమైన నేతగా ప్రజల్లో దృఢ విశ్వాసం కలిగించడంలో సక్సెస్
-దేశవ్యాప్తంగా పెరిగిన చరిష్మా
-రాష్ర్టాల్లో బీజేపీకి ప్రతికూలతలున్నా జాతీయ స్థాయి నేతగా మోదీకే పట్టం
-మోదీకి దీటైన నేతను ప్రజల ముందుంచడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలం

న్యూఢిల్ల్లీ: దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరోమారు నరేంద్ర మోదీ నాయకత్వానికే జై కొట్టారు. 2014 ఎన్నికల్లో మోదీని మార్పుకు ఓ ఆశాకిరణంగా భావించిన భారత ప్రజానీకం.. 2019కి వచ్చేసరికి దేశం కోసం ఎంతటి కఠిన నిర్ణయాలనైనా మొండితనంతో నెగ్గించుకోగలిగే నాయకుడిగా భావిస్తూ, మరోసారి ప్రధానిగా ఆయనకే పట్టం కట్టారు. అయితే ఈ ఎన్నికల్లో మోదీ చరిష్మా మరింత పెరుగడంతో పాటు బీజేపీ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో పుంజుకుందన్న విషయాన్ని గమనించవచ్చు. ఉత్తరాది రాష్ట్రాలకే బీజేపీ పరిమితం అన్న వాదన తప్పని ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి. దక్షిణాది రాష్ర్టమైన కర్ణాటకలో గత యేడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇప్పడు అదే రాష్ర్టం నుంచి గణనీయమైన సంఖ్యలో లోక్‌సభ స్థానాలను సాధించి దక్షిణాది రాష్ట్రాల్లో సైతం కాషాయ రెపరెపలు ఎగురబోతున్నాయని నిరూపించింది. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సైతం అత్యధిక లోక్‌సభ సీట్లను కైవసం చేసుకొని సొంత మెజార్టీతో వరుసగా రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టనున్న నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. కీలకమైన హిందీ రాష్ట్రాల్లో ఉన్న తన పట్టును బీజేపీ కోల్పోకుండా నిలుపుకోవడంతో.. మిత్రపక్షాల అవసరం లేకుండానే మోదీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటును సాధించారు.

ఢీ అంటే ఢీ

నరేంద్ర మోదీ హవా సొంత రాష్ర్టం గుజరాత్‌తో పాటు బీహార్, చత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కొనసాగింది. బీజేపీ విజయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పావులు కదిపిన ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి కూడా కాషాయ ప్రభంజనాన్ని అనుకున్న స్థాయిలో నిలువరించలేకపోయింది. రాష్ర్ట ఎన్నికల్లో కుల సమీకరణల మూలంగా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రాణించలేకపోయినప్పటికీ, జాతీయ స్థాయి ఎన్నికలు వచ్చేసరికి ఓటర్లకు మోదీనే బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించడంతో కమలం వికసించింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలే ఇందుకు నిదర్శనం.
modi-sha1

తిరుగులేని నేతగా..

గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1971లో వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత బలమైన నేతగా ఎదిగారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం, మోదీకి దీటైన నేతను ప్రజల ముందుంచడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమవ్వడం తదితర కారణాలతో మరో ఐదేండ్ల భారత భవిష్యత్తును ప్రజలు నరేంద్రునికే అప్పగించారు.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles