గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!


Sat,January 12, 2019 02:29 AM

India plans manned space mission by December 2021

-2021 డిసెంబర్ నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర
-రోదసిలోకి ముగ్గురు భారతీయులు
-వ్యోమగాములకు మనదేశంలో, రష్యాలో శిక్షణ
-ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్-2 ప్రయోగం
-మొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు
-ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడి

బెంగళూరు, జనవరి 11: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా 2021 డిసెంబర్ నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారు. వ్యోమగామి బృందంలో మహిళ కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో శుక్రవారం శివన్ మీడియాతో మాట్లాడుతూ... గతేడాది ఇస్రో సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల గురించి వివరించారు. భారత అంతరిక్ష చరిత్రలో గగన్‌యాన్ కీలక మలుపు అని చెప్పారు. ఈ మానవ సహిత యాత్రకు సంబంధించి ఇస్రో ప్రత్యేకంగా హ్యూమన్ స్పేస్ ైఫ్లెట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సెంటర్‌కు సీనియర్ శాస్త్రవేత్త ఉన్నికృష్ణన్ నాయర్ డైరెక్టర్‌గా ఉంటారని, డాక్టర్ కే హట్టన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇంజనీరింగ్, హ్యూమన్ సైన్స్ అనే రెండు విభాగాలు ఉన్నాయని తెలిపారు.

ఇంజనీరింగ్ విభాగంలో ఉండే లాంచ్ వెహికల్, క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్‌లో ఇస్రోకు ప్రావీణ్యత ఉందని, అయితే హ్యూమన్ సైన్స్ విభాగంలో వ్యోమగాముల ఎంపిక, శిక్షణ, వారికి అనువైన వాతావరణం రూపొందించే అంశాలు ఇస్రోకు కొత్త అని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యమిస్తామని శివన్ తెలిపారు. 2020 డిసెంబర్‌లో తొలి మానవ రహిత రోదసి యాత్రను, 2021 జూలైలో రెండో యాత్రను చేపడతామని, ఇవి పూర్తయిన తర్వాత 2021 డిసెంబర్‌లో మానవ సహిత యాత్ర చేపట్టనున్నట్లు వివరించారు. గగన్‌యాన్‌కు సంబంధించి వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ మనదేశంలోనే ఇస్తామని, తదుపరి అడ్వాన్స్‌డ్ శిక్షణ రష్యాలో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వ్యోమగాముల బృందంలో మహిళ కూడా ఉండాలని, అదే తమ లక్ష్యమని చెప్పారు. పురుషులతో పాటు మహిళలకూ శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. వ్యోమగాముల ఎంపికపై స్పందిస్తూ... భారత వాయుసేన సహాయంతో భారతీయులే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని, చివరి దశలో మాత్రం విదేశీ సంస్థ సహకారం కూడా తీసుకుంటామన్నారు. గగన్‌యాన్ ప్రయోగం విజయవంతమైతే మానవులను స్వతంత్రంగా రోదసిలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధిస్తుంది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ గగన్‌యాన్ ప్రాజెక్టు గురించి ప్రకటిస్తూ 2022 నాటికి భారత పుత్రిక లేదా పుత్రుడు అంతరిక్షంలోకి జాతీయ జెండాను మోసుకెళతారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.
KailasavadivooSivan1

చైనాతో పోటీపడుతున్నాం

చంద్రుడిపైకి భారత్ చేపడుతున్న రెండో ప్రయోగమైన చంద్రయాన్-2ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టాలని తొలుత నిర్ణయించినా, కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయిన కారణంగా ప్రయోగాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేసినట్లు వివరించారు. పదేండ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-1కు ఇది అడ్వాన్స్‌డ్ వర్షన్ అని చెప్పారు. రూ.800 కోట్ల వ్యయంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ప్రయోగం చేపడతున్నట్లు తెలిపారు. చంద్రయాన్-2లో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఉంటాయన్నారు. రోవర్ అంతరిక్ష ప్రయోగాల విషయంలో చైనాతో భారత్ ఏమాత్రం వెనుకబడి లేదని శివన్ స్పష్టం చేశారు. చంద్రుడి ఆవలివైపునకు చైనా రోవర్‌ను పంపిందని, అయితే ఇంతవరకు ఎవరూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు భారత్ వెళుతున్నదని వివరించారు. ఆ ప్రాంతంపై ఇప్పటివరకూ ఎవరూ పరిశోధనలు జరుపలేదని, అక్కడ నీరు ఉండే అవకాశం ఉందన్నారు.

2020 నాటికి సూర్యుడిపై ప్రయోగాలు

గతేడాది 26 రోదసి ప్రయోగాలు చేపట్టినట్లు శివన్ తెలిపారు. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్-11ను కూడా గతేడాది ప్రయోగించారు. అలాగే జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 క్రూ మాడ్యూల్‌ను కూడా పరీక్షించారు. ఇక ఈ ఏడాది ఇస్రో 32 ప్రయోగాలు చేపట్టనుంది. ఇందులో 14 రాకెట్లు, 17 ఉపగ్రహాలు, ఒక టెక్ డెమో మిషన్ ఉండనుంది. జనవరి 17న ఉన్నతి(యూనీస్పేస్ నానో శాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ బై ఇస్రో) ప్రోగ్రామ్‌ను ఇస్రో ప్రారంభించనుంది. పునర్వివినియోగ అంతరిక్ష వాహక నౌకను కూడా ఈ ఏడాది పరీక్షించనున్నారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని 2020 నాటికి చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత తేలికైన, చవకైన వాహన నౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీని ఈ ఏడాది జూలైలో పరీక్షించేందుకు ఇస్రో సిద్ధమవుతున్నది.

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles