అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం

Sun,February 10, 2019 03:02 AM

-ఆ రాష్ర్టాన్ని గుర్తించలేదని, టిబెట్‌లో అంతర్భాగమని బుకాయింపు
-చైనా మొండి వాదనను తోసిపుచ్చిన భారత్
-అరుణాచల్‌ప్రదేశ్ మనదేనని స్పష్టీకరణ

బీజింగ్ / న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జరిపిన పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. సమస్యాత్మకమైన ఈ సరిహద్దు రాష్ర్టాన్ని తాము ఎన్నడూ గుర్తించలేదని, సరిహద్దు సమస్యను తీవ్రతరం చేసే చర్యలకు భారత్ దూరంగా ఉండాలని చైనా సూచించింది. శనివారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించిన మోదీ.. ఆ రాష్ట్రంలో రూ.4 వేలకోట్లకుపై విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇటానగర్‌లోని ఐజీ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్ దేశానికి గర్వకారణమని చెప్పారు. ఇక్కడి ప్రజలు ఒకరినొకరు జైహింద్ అంటూ పలకరించుకునేవారని, వారి దేశభక్తికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు ఈశాన్య రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ. 13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

గత ప్రభుత్వాలు ఈశాన్య ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. అయితే అరుణాచల్‌ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో అంతర్భాగమని, అక్కడ భారత్ ఎటువంటి కార్యకలాపాలు సాగించరాదని చైనా వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనపై చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ స్పందిస్తూ.. భారత్-చైనా సరిహద్దు విషయంలో తాము స్థిరమైన, సుస్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్నామన్నారు. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ర్టాన్ని చైనా ప్రభుత్వం ఎన్నడూ గుర్తించలేదని, ఆ రాష్ట్రంలో మోదీ పర్యటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చైనా ఆందోళనలను, ప్రయోజనాలను గౌరవించాలని, సరిహద్దు వివాదాన్ని మరింత తీవ్రతరంచేసే చర్యలకు దూరంగా ఉండి ద్వైపాక్షిక సంబంధాలకు ఊతమిచ్చేందుకు తోడ్పడాలని భారత్‌కు చైనా విజ్ఞప్తి చేస్తున్నది అని ఆమె చైనా విదేశాంగశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

భారత్ నుంచి అరుణాచల్‌ను విడదీయలేరు..

అయితే దీనిపై మన దేశం తీవ్రస్థాయిలో స్పందించింది. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమని, దానిని ఎవరూ విడదీయలేరని స్పష్టంచేస్తూ.. మోదీ పర్యటనపై చైనా అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. భారత నాయకులు దేశంలోని అన్ని ప్రాంతాలను సందర్శించినట్టే అరుణాచల్‌ప్రదేశ్‌ను సందర్శిస్తున్నారు. భారత్ అనుసరిస్తున్న ఈ స్థిరమైన వైఖరి గురించి ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చైనాకు స్పష్టం చేశాం అని శనివారం ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. వాస్తవాధీన రేఖ (ఎల్యేసీ)లో 3,488 కి.మీ. పొడవైన సరిహద్దు విషయమై భారత్, చైనా మధ్య సుదీర్ఘ కాలం నుంచి వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు ఇప్పటివరకు 21 దఫాలు చర్చలు జరిపినప్పటికీ చైనా దురాక్రమణ ధోరణి వల్ల సమస్య అపరిష్కృతంగానే కొనసాగుతున్నది. అరుణాచల్‌ప్రదేశ్ విషయంలో చాలా మొండి వైఖరిని అవలంబిస్తున్న చైనా.. ఆ రాష్ట్రంలో భారత నాయకులు పర్యటించడాన్ని తరచుగా వ్యతిరేకిస్తున్నది.

మోదీకి నిరసనల సెగ

nudeprotest-Modi
రెండో రోజు అసోం పర్యటనలో మోదీకి నిరసనల సెగ తగిలింది. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర సచివాలయం జనతా భవన్ ఎదుట క్రిషక్ ముక్తి సంగ్రాం సమితి(కేఎమ్‌ఎస్‌ఎస్)కి చెందిన ఆరుగురు కార్యకర్తలు నగ్న ప్రదర్శన చేపట్టారు. అనంతరం వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీ పర్యటనకు నిరసనగా టాయ్ అహొం యుబ పరిషత్ 12 గంటల పాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి కేమ్‌ఎస్‌ఎస్‌తోపాటు మరో 70 సంఘాలు మద్దతు తెలిపాయి. తిన్సుకియా, దిబ్రూగఢ్, సిబ్‌సాగర్, లక్ష్మీపూర్ జిల్లాల్లో బంద్ ప్రభావం కనిపించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నల్ల బెలూన్‌లను ఎగురవేసి మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళుతున్నప్పుడు మోదీకి రెండు చోట్ల ఆందోళనకారులు నల్ల జెండాలను చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

1610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles