వాణిజ్యానికి కొత్త వ్యవస్థ

Sun,October 13, 2019 03:18 AM

-వాణిజ్యానికి కొత్త యంత్రాంగం
-భారత్-చైనా మధ్య వ్యాపార భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యం
-చైనాలోని వివిధ రంగాల్లోకి భారత పెట్టుబడులు
-సరిహద్దు విభేదాల పరిష్కారానికి చొరవ
-మోదీ-జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశంలో కీలక నిర్ణయాలు
-ఉగ్రవాదం, తీవ్రవాదం పెనుసవాల్‌గా మారాయన్న నేతలు
-ముగిసిన సదస్సు.. చర్చకు రాని కశ్మీర్ అంశం

మామల్లాపురం, అక్టోబర్ 12: భారత్-చైనా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. దీంతోపాటు భారత్ ప్రతిపాదిస్తున్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (రీజినల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్-ఆర్‌సీఈపీ)పై ఆలోచిస్తామని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఉన్న విబేధాలను క్రమంగా పరిష్కరించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలని వారిద్దరూ నిర్ణయించారు. ఇరువైపులా విశ్వాసం పెంపొందించేలా సరిహద్దులో శాంతి నెలకొల్పడం, రక్షణ సహకారం వంటి అనేక చర్యలు చేపట్టనున్నారు. తమిళనాడులోని మామల్లాపురంలో మోదీ-జిన్‌పింగ్ మధ్య రెండు రోజులపాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ-జిన్‌పింగ్ శనివారం ఉదయం రిసార్ట్‌లో భేటీ అయ్యారు. దాదాపు 90 నిమిషాలపాటు పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది. ఇందులో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పాల్గొన్నారు. అనంతరం మోదీ ఏర్పాటుచేసిన మధ్యాహ్నం విందును జిన్‌పింగ్ స్వీకరించారు. ఆ తర్వాత భారత పర్యటనను ముగించుకొని నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటన తనకు మరుపురానిదిగా మిగిలిపోతుందని జిన్‌పింగ్ పేర్కొనగా.. ఈ సదస్సు భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని మోదీ అభివర్ణించారు.

modi3

ఏడు గంటలపాటు చర్చలు

రెండు రోజులపాటు జరిగిన సదస్సులో మోదీ-జిన్‌పింగ్ దాదాపు ఏడుగంటలపాటు చర్చించారని, అనేక అంశాలపై మనసువిప్పి మాట్లాడుకున్నారని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఇరు దేశాధినేతల చర్చల సారాంశాన్ని ఆయన శనివారం మీడియాకు వివరించారు. మోదీ-జిన్‌పింగ్ మొత్తం 16 అంశాలపై చర్చించుకున్నట్టు తెలిపారు. వారి మధ్య కశ్మీర్ అంశం చర్చకు రాలేదని తెలిపారు. కశ్మీర్ అంశం పూర్తిగా మన అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అయితే పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ వారం ప్రారంభంలో జరిపిన చైనా పర్యటన గురించి జిన్‌పింగ్ ప్రధాని మోదీకి క్లుప్తంగా వివరించినట్టు చెప్పారు. ప్రపంచ, ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న అనేక దీర్ఘకాలిక, వ్యూహాత్మక సమస్యలపై ఇద్దరు నేతలు లోతుగా విశ్లేషించారు. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పూర్తి స్నేహపూరిత వాతావరణంలో చర్చలు జరిగాయి అని గోఖలే పేర్కొన్నారు.

వాణిజ్యం.. పెట్టుబడులపై అత్యున్నత యంత్రాంగం

భారత్-చైనా మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు సంయుక్తంగా ఓ అత్యున్నత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మోదీ-జిన్‌పింగ్ నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగుపరుచడం, సంతులనం సాధించడం వంటివి ఈ యంత్రాంగం ప్రధాన లక్ష్యాలని గోఖలే చెప్పారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య నిర్దేశిత రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పత్తి భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవసరమైన సలహాలను కూడా ఇస్తుందన్నారు. ఈ యంత్రాంగానికి భారత ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, చైనా ఉప ప్రధాని హూ చున్హువా నేతృత్వం వహించనున్నట్టు చెప్పారు. ఇరు దేశాలు శాంతియుత, సురక్షితమైన, సుసంపన్నమైన ప్రపంచం కోసం పనిచేస్తున్నాయి.

21వ శతాబ్దపు ఆకాంక్షలకు అనుగుణంగా, అంతర్జాతీయ నియమాలకు లోబడి అన్ని దేశాలు అభివృద్ధి చెందాలన్నదే మోదీ-జిన్‌పింగ్ లక్ష్యం అని చెప్పారు. భారత్-చైనా మధ్య వాణిజ్యలోటుకు సంబంధించి భారత ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని జిన్‌పింగ్ చెప్పారు. చైనాలోని ఐటీ, ఔషధ తయారీ వంటి రంగాల్లోకి భారత పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు. 16 దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కోసం భారత్ ప్రతిపాదిస్తున్న ఆర్‌సీఈపీపై ఆలోచిస్తామని హామీ ఇచ్చారు అని గోఖలే వెల్లడించారు. ఆర్‌సీఈపీలో ఆసియాన్ కూటమిలోని పది దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సభ్యదేశాలుగా ఉండాలని భారత్ ప్రతిపాదిస్తున్నది.

నేపాల్‌కు వెళ్లిన జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన 24 గంటల భారత అనధికారిక సదస్సును ముగించుకొని శనివారం సాయంత్రం నేపాల్‌కు వెళ్లారు. ప్రధాని మోదీ సైతం జిన్‌పింగ్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఢిల్లీకి వెళ్లిపోయారు.

modi2

చైనా అధ్యక్షుడికి పట్టు శాలువా

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ ఓ విశిష్ట కానుకను అందజేశారు. జిన్‌పింగ్ ముఖచిత్రంతో కూడిన పట్టు శాలువాను ఆయనకు బహూకరించారు. కోయంబత్తూర్ జిల్లా శిరుముగైపుదూర్‌కు చెందిన శ్రీరామలింగ సౌదాంబిగై చేనేత సహకార సంఘం వారు ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. స్వచ్ఛమైన మల్బరీ పట్టు, బంగారు దారంతో (జరీ) దీనిని అల్లారు. దీన్ని పూర్తిచేయడానికి ఐదురోజులు పట్టింది. తమిళనాడులోని కాంచీపురం, ఆరణి, మదురై, కోయంబత్తూర్, రాశిపురం చేనేత కళలకు ప్రసిద్ధి. శుక్రవారం ప్రధాని మోదీ నచిరాకోయిల్ దీపపు సెమ్మె, సరస్వతి దేవి తంజావూర్ పెయింటింగ్‌ను జిన్‌పింగ్‌కు అందజేసిన విషయం తెలిసిందే.

ఉగ్రవాదం పెను సవాల్

ప్రస్తుతం ప్రపంచానికి ఉగ్రవాదం, తీవ్రవాదం పెనుసవాల్‌గా మారాయని మోదీ-జిన్‌పింగ్ అభిప్రాయపడినట్టు గోఖలే చెప్పారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని, ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తూ, నిధులు, శిక్షణ అందిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచే చర్యలను వేగవంతం చేయాలని వారు ఆకాంక్షిచినట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి వివక్షకు తావుండొద్దని స్పష్టం చేశారన్నారు. భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకొని శాంతిని, విశ్వాసాన్ని నెలకొల్పే దిశగా ఇరు దేశాలూ తమ చర్యలను వేగవంతం చేయాలని మోదీ-జిన్‌పింగ్ నిర్ణయించినట్టు చెప్పారు.

తమ మధ్య జరిగిన మొదటి అనధికారిక సమావేశం వుహాన్ సదస్సు స్ఫూర్తిని కొనసాగించాలని, విబేధాలు ఘర్షణ స్థాయికి చేరకముందే పరిష్కరించుకోవాలని వారిద్దరూ ఆకాంక్షించారు. ఈ క్రమంలో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను చైనా పర్యటనకు ఆహ్వానించారు. భారత్-చైనా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించాలని ఇరుదేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా రెండు దేశాల్లో కలిపి మొత్తం 70 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా పర్యాటక రంగ అభివృద్ధిని మోదీ కాంక్షించారు.

modi4

చైనా నేతల కారు హాంగ్‌కీ!

ప్రధాని మోదీతో అనధికారిక సమావేశం కోసం భారత్‌కు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. చెన్నై నుంచి సుమారు 50 కి.మీ దూరంలో ఉన్న మహాబలిపురానికి రోడ్డు మార్గంలోనే ప్రయాణించారు. ప్రధాని మోదీ మాత్రం హెలికాప్టర్‌లో వెళ్లారు. దీంతో చైనా అధ్యక్షుడి నిర్ణయం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. హెలికాప్టర్లలో ప్రయాణించకూడదన్న తమ విధానపరమైన నిర్ణయం కారణంగానే జిన్‌పింగ్.. చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన హాంగ్‌కీ అనే లగ్జరీ కారులో రోడ్డు మార్గంలో వెళ్లారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ) వ్యవస్థాపకులు మావో జెడాంగ్ నుంచి ఆ పార్టీ అగ్ర నేతలంతా ఈ లగ్జరీ బ్రాండ్ కారునే వినియోగిస్తున్నారు. హాంగ్‌కీ అంటే చైనీస్ భాషలో ఎర్రజెండా అని అర్థం. చైనా నేతలు విమానం, కారులోనే పర్యటిస్తారు.

హెలికాప్టర్‌ను వినియోగించరు అని ఆ దేశానికి చెందిన ఒక అధికారి వెల్లడించారు. హాంగ్‌కీకి చైనాలో పొలిటికల్ కార్ అనే పేరుంది. సీపీసీ అగ్రనేతల కోసం ప్రభుత్వ రంగ ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్‌ఏడబ్ల్యూ) 1958లో తొలిసారి హాంగ్‌కీ కారును ఉత్పత్తిచేసింది. రాజకీయ నేతల కారు అనే ముద్ర ఉన్న కారణంగా అమ్మకాలు పెద్దగా లేకపోవడంతో ఆ ముద్రను చెరిపేసేందుకు హాంగ్‌కీ కారును తయారుచేసే సంస్థ చర్యలు చేపడుతున్నది. ఆడీ, బీఎండబ్ల్యూ వంటి విదేశీ బ్రాండ్లకు పోటీగా చైనా బ్రాండ్ ఇమేజీని పెంచేలా వినూత్నంగా రూపొందించాలని భావిస్తున్నది.

1014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles