మన దారిద్య్రం మారలేదుFri,October 13, 2017 02:56 AM

-ఆకలిసూచీలో భారత్‌కు 100వ స్థానం
-మనకన్నా మెరుగ్గా బంగ్లాదేశ్, ఉత్తర కొరియా, ఇరాక్
-ఆసియా దేశాల్లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మాత్రమే మనకన్నా వెనుకంజ

Hunger
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: అగ్రరాజ్యాలకు దీటుగా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్నదని సంకలు గుద్దుకుంటున్నాం. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని గొప్పలు చెప్పుకొంటున్నాం. కానీ మన దేశంలోని పేదల తలరాత ఏమీ మారడం లేదని, మన దారిద్య్రం అలాగే కొనసాగుతున్నదని తేలింది. దేశం లో అన్నార్థుల సంఖ్య ఇంకా పెరుగుతున్నదని వెల్లడైంది. ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత్‌కు 100వ స్థానం దక్కింది. గత ఏడాది మన దేశం 97వ స్థానంలో ఉండగా ఈసారి మరో మూడు స్థానాలు దిగజారింది. ఈ ఏడాది 119 దేశాల్లో అధ్యయనం చేసి విడుదల చేసిన జాబితాలో అరాచక పాలన కొనసాగుతున్న ఉత్తరకొరియా (93), యుద్ధంతో తీవ్రంగా ధ్వంసమైన ఇరాక్ (78) కన్నా మనం వెనుకబడి ఉన్నామని సర్వే స్పష్టం చేసింది. ఆసియా దేశాల్లో దాయాది పాకిస్థాన్ (106), ఆఫ్ఘనిస్థాన్ (107) మాత్రమే మనకన్నా వెనుకబడి ఉన్నాయి.

మన పొరుగున ఉన్న చైనా-29, నేపాల్-72, మయన్మార్-77, శ్రీలంక-84 , బంగ్లాదేశ్-88 స్థానాలతో మనకన్నా మెరుగ్గా ఉన్నాయి. పిల్లల్లో పోషకాహార లోపం, శిశుమరణాలు, బాలల్లో ఎదుగుదల లోపాలను ఐఎఫ్‌పీఆర్‌ఐ అధ్యయనం చేసి పాయింట్లు కేటాయిస్తుంది. వాటి ఆధారంగా అంతర్జాతీయ ఆకలి సూచీని రూపొందిస్తుంది. తాజా సర్వేలో భారత్ స్కోరు 31.4. దీనిని బట్టి మన దేశంలో పరిస్థితి ఆందోళనకర స్థాయిలో ఉన్నదని అర్థం. పాయింట్లు 28.5 కన్నా తగ్గితే తీవ్ర ఆందోళనకరంగా ఉన్నట్టు లెక్క. ఈ ఏడాది నివేదిక ప్రకారం మన దేశంలో 21 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దేశంలోని ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు తక్కువ బరువుతో బాధపడుతుండగా, ప్రతి ముగ్గురిలో ఒకరు వయసుకు తగిన ఎత్తు పెరుగడం లేదు.

ఈ ఏడాది భారత్‌తోపాటు శ్రీలంక, తూర్పు ఆఫ్రికాలోని, జిబూతీ, దక్షిణ సూడాన్‌లో మాత్రమే 20 శాతం మంది పిల్లలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. మన దేశంలో పోషకాహార సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వాలు భారీ ఎత్తున పథకాలు అమలు చేస్తున్నా వ్యవస్థలోని నిర్మాణాత్మక, ఆచరణాత్మక లోపాల వల్ల అవి లబ్ధిదారులకు చేరడం లేదని ఐఎఫ్‌పీఆర్‌ఐ దక్షిణాసియా డైరెక్టర్ పీకే జోషి పేర్కొన్నారు. దీంతో ఎంతోమంది పేద చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందన్నారు. అయితే 2022 నాటికి పోషకాహారలోపాన్ని అధిగమించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా మరింత నిబద్ధతతో ప్రణాళికలను అమలు చేస్తే రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు.

1035

More News

VIRAL NEWS