గుజ్రాల్‌ సూచనను పాటించని పీవీ

Fri,December 6, 2019 02:52 AM

-విని ఉంటే 1984 సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు
-సైన్యాన్ని రంగంలోకి దించాలని గుజ్రాల్‌ సూచించారు
-సిక్కుల ఊచకోత ఘటనపై జాతికి క్షమాపణ చెబుతున్నా
-గుజ్రాల్‌ శత జయంతి కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 5: దాదాపు 35 ఏండ్ల క్రితం ఇందిరాగాంధీ దారుణ హత్య జరిగిన తర్వాత 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ఇందర్‌కుమార్‌ గుజ్రాల్‌ (తర్వాత కాలంలో ప్రధాని పదవిని చేపట్టారు) సూచనను నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు పరిగణనలోకి తీసుకుని ఉంటే సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ శత జయంతి సందర్భంగా బుధవారం రాజ్యసభలో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘1984లో విషాద ఘటన జరిగినప్పు డు.. అప్పటి కేంద్ర హోంమంత్రి పీవీ నరసింహారావు వద్దకు ఐకే గుజ్రాల్‌ వెళ్లి.. ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాధ్యమైనంత త్వరగా సైన్యాన్ని రంగంలోకి దించుతూ ప్రభు త్వం ఆదేశాలు జారీ చేయడం తప్పనిసరని సూచించారు. ఆ సూచనను పీవీ నరసింహారా వు పాటించి ఉంటే 1984 ఊచకోత జరిగి ఉం డేది కాదు’ అని అన్నారు. 1984 అక్టోబర్‌ 31న సిక్కు అంగరక్షకుల చేతుల్లో ప్రధాని ఇం దిరాగాంధీ హత్యానంతరం సిక్కుల ఊచకోత జరిగినందుకు మన్మోహన్‌ సింగ్‌ క్షమాపణ చెప్పారు. నాటి ఊచకోతలో సుమారు మూడు వేల మంది హత్యకు గురయ్యారు. ‘నాటి మా రణ హోమానికి కేవలం సిక్కులకు మాత్ర మే కాదు. యావత్‌ జాతికి క్షమాపణ చెప్పేందుకు నేను సందేహించను.

నాడు ఆ విషాదం జరిగినందుకు నేను సిగ్గుతో తల దించుకుంటున్నాను’ అని మన్మోహన్‌ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు. 1977లో దేశంలో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత గుజ్రాల్‌తో తన సంబంధాలు ఎలా ఉన్నాయో మన్మోహన్‌ గు ర్తు చేసుకున్నారు. ‘దేశంలో ఎమర్జెన్సీ హయాంలో సమాచార, ప్రసారాలశాఖ మంత్రి గా పనిచేసిన ఆయన (గుజ్రాల్‌) కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో ఆయనను ప్రణాళికాశాఖ సహాయ మంత్రిగా మార్చేశారు. అప్పుడు నేను ఆర్థిక మంత్రిత్వశాఖకు సలహాదారుగా పని చేస్తున్నా. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య సంబంధాలు బలపడ్డాయి’ అని చెప్పా రు. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు గుజ్రాల్‌ కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా అత్యంత కీలక పాత్ర పోషించారు. 1976-80 మధ్య అప్పటి సోవియట్‌ యూనియన్‌లో భారత రాయబారిగా గుజ్రాల్‌ పని చేశారు. తర్వాత 1997 ఏప్రిల్‌ -1998 మార్చి మధ్య దేశ ప్రధానిగా గుజ్రాల్‌ సేవలందించారు.

ఊచకోతకు రాజీవ్‌దే బాధ్యత: బీజేపీ

సిక్కుల ఊచకోత ఘటనలోకి పీవీ నరసింహారావు పేరును తీసుకురావడం పట్ల మన్మోహన్‌ సింగ్‌పై బీజేపీ ధ్వజమెత్తింది. నాటి సిక్కుల ఊచకోతకు అప్పటి రాజీవ్‌గాంధీదే బాధ్యత అని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ హత్య జరిగిన రాత్రి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌ గాంధీ నాడు ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి తెచ్చే హక్కు కలిగి ఉన్నారన్నారు. కానీ సిక్కుల హత్యాకాండకు రాజీవ్‌గాంధీ మద్దతు పలికారని, భారీ వృక్షం పడిపోయినప్పుడు భూమి కంపిస్తుందని ఇందిరాగాంధీ హత్యానంతర మారణకాండను సమర్థించే విధంగా ఆయన వ్యాఖ్యానించారన్నారు. మరోవైపు, మన్మోహన్‌ సింగ్‌ ‘నిజం’ చెప్పినందుకు గుజ్రాల్‌ కుమారుడు, ఎన్డీఏ మిత్రపక్షం అకాలీదళ్‌ ఎంపీ నరేశ్‌ గుజ్రాల్‌ ప్రశంసించారు. ‘వాస్తవాలు చెప్పినందుకు ఆనందిస్తున్నా. మన్మోహన్‌ను ప్రశంసిస్తున్నా’ అని చెప్పారు.
Prakash-Javadekar

265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles