ఆదేశిస్తే.. రంగంలోకి దిగుతాం

Sun,February 17, 2019 02:43 AM

-వాయుసేన అధిపతి ధనోవా వ్యాఖ్య
-పోఖ్రాన్‌లో వాయు శక్తి పాటవ ప్రదర్శన
-భారీ విన్యాసాలను నిర్వహించిన వాయుసేన
-పాల్గొన్న 140 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు

పోఖ్రాన్, ఫిబ్రవరి 16: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే అవకాశాలను సైన్యం అన్వేషిస్తున్న క్రమంలో.. భారత ప్రభుత్వం ఆదేశిస్తే తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ప్రకటించారు. పాకిస్థాన్ పేరును, పుల్వామా దాడిని ప్రస్తావించకపోయినా పాక్‌ను ఉద్దేశించే పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ సరిహద్దుకు సమీపంలోని పోఖ్రాన్‌లో భారత వాయుసేన శనివారం వాయు శక్తి పేరిట భారీ విన్యాసాలను నిర్వహించింది. సుమారు 140 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ధనోవా మాట్లాడుతూ... దేశ భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో, దేశ సార్వభౌమత్వ పరిరక్షణలో వాయుసేన నిబద్ధతతో పనిచేస్తున్నదని చెప్పారు. మన రాజకీయ అధినాయకత్వం ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపట్టేందుకు వాయుసేన సిద్ధంగా ఉందన్నారు.

ముందుగా నిర్ణయించిన మేరకే వాయుశక్తి కార్యక్రమాన్ని చేపట్టినా.. పుల్వామా దాడి నేపథ్యంలో కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే వాయుసేన పాటవాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యర్థులకు చాటిచెబుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సంప్రదాయ యుద్ధంలో మనపై గెలిచే సత్తా తమకు లేదని ప్రత్యర్థులకు తెలుసని, అందుకే ఉగ్రచర్యలకు దిగుతున్నారని ధనోవా వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి భూభాగంపై అడుగిడి దాడిచేయగల మన సత్తాను ఈ రోజు ప్రదర్శిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ఆకాశ్, అస్త్రతో పాటు మిగ్ 29 యుద్ధ విమానాలు, ఎస్‌యూ-30, మిరేజ్ 2000, జాగ్వార్స్, మిగ్21 బైసన్, మిగ్27, మిగ్ 29, ఐఎల్78, హెర్క్యులస్, ఏఎన్-32 వంటి హెలికాప్టర్లు ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఆర్మీ అధిపతి బిపిన్ రావత్, ఐఏఎఫ్ గౌరవ కెప్టెన్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

5057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles