పరిశోధన కోసమే నక్సల్స్‌ను కలిశా


Tue,April 16, 2019 02:00 AM

I am in touch with Naxals for research books Navlakha tells HC

-బొంబాయి హైకోర్టులో పౌరహక్కుల నేత గౌతం నవ్‌లఖా వెల్లడి
ముంబై, ఏప్రిల్ 15: తాను నక్సల్స్‌తో సంప్రదింపులు జరుపుతున్న మాట నిజమేనని పౌరహక్కుల నాయకుడు గౌతమ్ నవ్‌లఖా సోమవారం బొంబాయి హైకోర్టుకు తెలిపారు. తాను రాసిన పుస్తకాలు, పరిశోధన కోసం నక్సల్స్‌ను తాను కలిశానని తెలిపారు. 2017 డిసెంబర్ 31నాటి కోరెగావ్-భీమా ఘటనతో సంబంధం ఉన్నదని ఆరోపిస్తూ తనపై పుణె పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని నవ్‌లఖా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌లు రంజిత్ మోరె, భారతి డాంగ్రేలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. నవ్‌లఖాతోపాటు మరో నలుగురు పౌరహక్కుల నాయకులకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. నవ్‌లఖా తరఫున న్యాయవాది యుగ్ చౌదరి వాదిస్తూ.. తన క్లయింట్ రచయిత అని, శాంతి కోసం కృషి చేసే కార్యకర్త అని పేర్కొన్నారు. గతంలో ఆరుగురు పోలీసులను నక్సల్స్ కిడ్నాప్ చేసినప్పుడు వారిని విడిపించేందుకు కేంద్రం ఆయనను మధ్యవర్తిగా నియమించింది అని గుర్తు చేశారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అప్పటి వరకు నవ్‌లేఖను అరెస్ట్ చేయరాదని జారీ చేసిన ఆదేశాలను పొడిగించింది. ఈ కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోంజాల్వెడ్, సుధా భరద్వాజ్ తదితరులు నిందితులుగా ఉన్నారు.

109
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles