మోదీ లాంటి వ్యక్తిని కాను..నేను మనిషిని: రాహుల్Thu,December 7, 2017 02:24 AM

rahul
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: తాను మనిషినని, పొరపాట్లు చేస్తానని, మోదీ లాంటి వ్యక్తిని కాదని త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడు కానున్న రాహుల్‌గాంధీ బీజేపీపై, ప్రధానమంత్రిపై పంచ్‌లు విసిరారు. గుజరాత్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ పాలనను విమర్శిస్తూ రాహుల్ కొన్ని రోజులుగా రోజుకొక ప్రశ్నవేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు ఎంత శాతం పెరిగాయో తెలుపుతూ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. అయితే అందులో కొన్ని అంకెల్లో పొరపాట్లు దొర్లాయి. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు ఎత్తిచూపారు. ఇందుకు సమాధానంగా రాహుల్ బుధవారం మరో ట్వీట్ చేస్తూ వారికి థ్యాంక్స్ చెప్పారు. బీజేపీ మిత్రులారా.. నేను మనిషిని.. నరేంద్రభాయ్ లాంటి వ్యక్తిని కాను. మనం తప్పులు చేస్తాం. అదే జీవితాన్ని ఆసక్తికరంగా మారుస్తుంది. నా తప్పులేమైనా ఉంటే తెలియజేయండి. అది నా ఎదుగుదలకు తోడ్పడుతుంది అని సమాధానం ఇచ్చారు.

రాహుల్‌ను నాయకుడిగా మార్చిన గుజరాత్ ఎన్నికలు : శివసేన

ముంబై: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రాహుల్‌గాంధీని నాయకుడిగా మార్చిందని బీజేపీ మిత్రపక్షమైన శివసేన బుధవారం పేర్కొన్నది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవాలయాలను సందర్శించడం హిందుత్వ విజయంగా భావించాలని, దీనిని బీజేపీ స్వాగతించాలని వ్యాఖ్యానించింది. గుజరాత్ ఎన్నికల్లో గెలువాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రధానికి దీటుగా రాహుల్‌గాంధీ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది ఆయనను నాయకుడిగా తీర్చిదిద్దింది అని తన సామ్నా పత్రిక సంపాదకీయంలో శివసేన పేర్కొన్నది. రాహుల్‌గాంధీని ఔరంగజేబుతో ప్రధాని మోదీ పోల్చడం ద్వారా తన సమర్థుడైన ప్రత్యర్థిగా అంగీకరించినట్టు అనిపిస్తున్నదని తెలిపింది.

219

More News

VIRAL NEWS