ఐదేండ్లలో అందరికీ ఇండ్లుFri,April 21, 2017 01:33 AM

-కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: మరో ఐదేండ్లలో నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటి వసతిని కల్పించాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అందరికీ ఇండ్లు పథకం ప్రగతిని వివరించడానికి ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. 2015 జూన్‌లో పథకం ప్రారంభించి రెండేండ్లలోనే 17.74 లక్షల ఇండ్లను మంజూరు చేశామని, ఇందుకోసం రూ. 96,266 కోట్ల పెట్టుబడులు సమకూర్చామన్నారు.
Venkaiah-Naidu
ఇందులో కేంద్రం వాటా రూ.27,883 కోట్లని తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం జేఎన్‌యూఆర్‌ఎం మిషన్ కింద పదేండ్లలో 13.82 లక్షల ఇండ్లను మాత్రమే మంజూరు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం రెండేండ్లలోనే 3.90 లక్షల అదనపు ఇండ్లను మంజూరు చేసిందన్నారు. యూపీఏ పదేండ్లలో రూ. 32,713 కోట్లను మాత్రమే కేటాయిస్తే ఎన్డీఏ ప్రభుత్వం రెండేండ్లలోనే రూ. 96,266 కోట్లను కేటాయించిందని గుర్తుచేశారు. ఈ పథకంలో ఇప్పటికే 13 రాష్ర్టాలు చేరాయని, మరో 16 రాష్ర్టాలు చేరాల్సి ఉందన్నారు. కేరళ, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్ లాంటి చిన్న రాష్ర్టాలతో పాటు ఈశాన్య రాష్ర్టాలన్నింటా 2019కల్లా ఇండ్ల నిర్మాం పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందుకు 15 చిన్న రాష్ర్టాలు ఈ సంవత్సరాంతానికల్లా పూర్తిస్థాయి ప్రతిపాదనలను పంపాలని సూచించామన్నారు. మిగిలిన పెద్ద రాష్ర్టాలు వచ్చే సంవత్సరంకల్లా ఆయా రాష్ర్టాల్లో ఎన్ని ఇండ్లు అవసరమవుతాయో ప్రతిపాదనలను పంపితే లక్ష్యానికి అనుగుణంగా 2022కల్లా ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చునని తెలిపారు.

అద్దె ఇండ్లకో పథకం


పట్టణీకరణ పెరుగుతున్నందువల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు అద్దె ఇండ్లలో ఉండాల్సి వస్తున్నదని దీన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ పట్టణ అద్దె ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నదని మంత్రి తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోట్ కేంద్ర మంత్రివర్గం ముందుకు వస్తుందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పట్టణాల్లో సుమారు 30% మంది అద్దెఇండ్లలోనే నివసిస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నూతన పథకాన్ని తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ క్రమబద్ధీకరణ చట్టంలోని 50 సెక్షన్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయని, మిగిలిన 32 సెక్షన్లు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రతి అంగుళం భారత్‌దే


అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమని, ఈ అంశంలో మరో అభిప్రాయానికి తావే లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పాత్రికేయులు అరుణాచల్ అంశాన్ని లేవనెత్తగా ఆయన చైనాపై ఘాటుగా స్పందించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రతి అంగుళం భారత్‌దేనని, ఏ దేశానికీ ఎలాంటి హక్కు, అధికారం లేవన్నారు. ఆ రాష్ట్రంలోని ప్రాంతాల పేర్లు మార్చే అధికారం ఏ దేశానికీ లేదని అన్నారు.

281

More News

VIRAL NEWS