పంచ్‌కులలో హింసను ఎగదోయడం నిజమేFri,October 13, 2017 02:15 AM

విచారణలో హనీప్రీత్ అంగీకారం
honeypreet
పంచ్‌కుల: డేరా సచ్చాసౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీం సింగ్‌ను పంచ్‌కులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన తర్వాత హింసకు ప్రేరేపించినట్లు గుర్మీత్ దత్తపుత్రిక హనీప్రీత్ తమ విచారణలో అంగీకరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించిన తర్వాత హర్యానాలో జరిగిన దాడుల్లో 38 మంది పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. హనీప్రీత్, ఆమె సహచరుడు సుఖ్‌దీప్ కౌర్‌లు హింసను ప్రేరేపించేందుకు వీడియో క్లిప్పింగ్‌లతో ప్రచారం చేసినట్లు విచారణలో అంగీకరించారని సిట్ అధికారులు తెలిపారు. పంచ్‌కులలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి హనీప్రీత్ కొంత మందికి రూ.1.25 కోట్లు పంపిణీ చేశారని ఆమె డ్రైవర్ రాకేశ్ కుమార్ అరోరా పోలీసులకు చెప్పారు. ఇదిలా ఉండగా, హనీప్రీత్ సమక్షంలో విచారణకు సిద్ధమేనని డేరా సచ్చా సౌదా ట్రస్ట్ చైర్‌పర్సన్ విపాసన తమకు తెలిపారని హర్యానా డీజీపీ బీఎస్ సంధూ చెప్పారు. మంగళవారం విచారణకు హాజరు కావాల్సిన విపాసన అనారోగ్య కారణాల రీత్యా గైర్హాజరు కావడంతో బుధవారం వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దర్యాప్తు కీలక దశకు చేరుకున్నదని డీజీపీ సంధూ చెప్పారు. హనీప్రీత్ సమక్షంలో విపాసనను ప్రశ్నించాల్సి ఉన్నదన్నారు. వైద్య పరీక్షల నివేదికలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

133

More News

VIRAL NEWS