పన్ను వసూళ్లు బంపర్Tue,January 10, 2017 03:30 AM

పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన నగదు కొరత వల్ల ఆర్థిక వృద్ధిరేటు తగ్గుముఖం పట్టిందన్న వాదనను కేంద్రం తోసిపుచ్చింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు పెరుగడమే దీనికి నిదర్శనమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

న్యూఢిల్లీ, జనవరి 9:నోట్ల రద్దు తర్వాత వృద్ధిరేటు తగ్గుముఖం పట్టిందన్న వాదనను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కొట్టి పారేశారు. పన్ను వసూళ్లు భారీగా పెరుగడమే దీనికి నిదర్శనమన్నారు. గత రెండు నెలల్లోనే ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.01 శాతంతోపాటు పరోక్ష పన్ను వసూళ్లు గణనీయంగానే పెరిగాయని జైట్లీ సోమవారం మీడియాతో అన్నారు. నికర పన్ను వసూళ్లలో సేవా పన్ను వాటా రూ.1.83 లక్షల కోట్లు ఉన్నదన్నారు. గత తొమ్మిది నెలల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.53 లక్షల కోట్లకు చేరాయని, ఇది బడ్జెట్ అంచనాల్లో 65.3 శాతమని మంత్రి జైట్లీ తెలిపారు. పరోక్ష పన్ను వసూళ్లు 25% పురోగతితో 6.30 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఇది బడ్జెట్ అంచనాల్లో 81% అని అన్నారు. స్థూల కార్పొరేట్ ఆదాయం పన్ను (సీఐటీ) 10.7%, వ్యక్తిగత ఆదాయం పన్ను (పీఐటీ) 21.7% పెరిగిందన్నారు. నికర సీఐటీ వసూళ్లు 4.4%, పీఐటీ వసూళ్లు 24.6 శాతానికి చేరాయని, ఇది 2015 - 16తో పోలిస్తే 30.5% అధికమని మంత్రి జైట్లీ తెలిపారు. గత డిసెంబర్ నాటికి ముందస్తు పన్ను వసూళ్లు రూ.2.82 లక్షల కోట్లకు (14.4శాతం) పెరిగాయన్నారు. సీఐటీ ముందస్తు చెల్లింపులు 10.6%, పీఐటీ ముందస్తు చెల్లింపులు 38.2 శాతం పెరిగాయన్నారు.
arun-jaitley

గత రెండు నెలల్లో గణనీయ ప్రగతి


2015లో చివరి రెండు నెలలతో పోలిస్తే గత డిసెంబర్‌లో పన్ను వసూళ్లలో ప్రగతి సాధించామని కేంద్రమంత్రి జైట్లీ వివరించారు. గత నవంబర్‌లో పరోక్ష పన్ను చెల్లింపులు 12.8 శాతం వృద్ధి చెందాయని అన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత గత రెండు నెలల్లో నగదు కొరత ఏర్పడిందని బహిరంగ చర్చ జరిగింది. 2015తో పోలిస్తే గత రెండు నెలల్లో పన్ను వసూళ్ల డాటా సారూప్యత ఉంది అని తెలిపారు. డిసెంబర్‌లోనే పరోక్షపన్ను చెల్లింపులు 14.2%, ఎక్సైజ్ సుంకం చెల్లింపుల్లో 31.6%, సేవా పన్ను చెల్లింపులు 12.4% పెరిగాయన్నారు. బంగారం దిగుమతులు తగ్గడంతో కస్టమ్స్ సుంకం చెల్లింపులు 6.3% మాత్రమే పెరిగాయని తెలిపారు. గత ఏడాది నవంబర్ 8న పాత నోట్ల రద్దుతో పారిశ్రామిక ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందన్న ఆందోళన వ్యక్తమైంది. పారిశ్రామిక ఉత్పాదకత పెరగడం వల్లే డిసెంబర్‌లో ఎక్సైజ్ డ్యూటీ 43% పెరిగింది.

ఉద్యోగాల్లో కోత వట్టిదే


నోట్ల రద్దు తర్వాత ఉద్యోగాల్లో కోత పడిందని వచ్చిన వార్తలు వట్టి పుక్కిటి పురాణాలని కేంద్ర మంత్రి జైట్లీ కొట్టి పారేశారు. కొన్ని అంశాలపైనే ఆధారపడి వృద్ధిరేటు పెరుగదన్నారు. డిసెంబర్‌లోనే సెంట్రల్ ఎక్సైజ్ వసూళ్లు 31.6% పెరిగి రూ.36 వేల కోట్లకు, సేవాపన్ను వసూళ్లు 12.4 శాతం వృద్ధితో రూ.23 వేల కోట్లకు చేరాయని తెలిపారు. గతనెలలో ఎక్సైజ్, సేవా పన్ను, కస్టమ్స్ సుంకంతో కలిపి పరోక్ష పన్నులు 14.2% పెరిగి రూ.76 వేల కోట్లకు చేరాయన్నారు.

రాష్ర్టాల్లో భారీగా వ్యాట్ వసూళ్లు


వివిధ రాష్ర్టాల్లోనవంబర్‌లో పాత నోట్ల రూపంలో వ్యాట్ వసూళ్లు పెరిగాయన్నారు. సుపరిపాలన గల రాష్ర్టాల్లో వ్యాట్ చెల్లింపులు బాగా పెరిగాయని జైట్లీ అన్నారు. గత తొమ్మిది నెలల్లో ఎక్సైజ్ సుంకం వసూళ్లు 43 శాతం వృద్ధి చెంది రూ.2.73 లక్షల కోట్లకు, సేవా పన్ను వసూళ్లు 23.9 % పురోగతితో రూ.1.83 లక్షల కోట్లు, కస్టమ్స్ డ్యూటీ వసూళ్లు 4.1 శాతం పెరిగి రూ.1.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

పూర్తి గణాంకాలు వచ్చాకే జీడీపీపై స్పందిస్తాం


పన్ను వసూళ్లకు, జీడీపీ వృద్ధిరేటుకు మధ్య గల తేడాపై పూర్తి గణాంకాలు వచ్చిన తర్వాత స్పందిస్తామని మంత్రి జైట్లీ అన్నారు. ప్రస్తుతం తాము ముందస్తు పన్ను చెల్లింపుల అంచనాలను మాత్రమే తెలియజేస్తున్నామని, పూర్తిస్థాయి సమాచారం కాదన్నారు. ముందస్తు అంచనా ప్రకారం గతేడాదితో పోలిస్తే జీడీపీ 7.6 % నుంచి మూడేండ్ల దిగువన గల 7.1శాతానికి పడిపోతుందని గతవారం కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్వో) పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత పారిశ్రామిక ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకోలేదు.

1496
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS