
-సిద్ధార్థ్ సంఘ్వి మర్డర్ కేసునుఛేదించిన పోలీసులుముంబై, సెప్టెంబర్ 10: ఐదురోజుల కిందట కనిపించకుండా పోయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సంఘ్విని కేవలం రూ.30 వేల కోసం ఓ దుండగుడు హత్యచేశాడని మహారాష్ట్ర పోలీసులు సోమవారం వెల్లడించారు. సిద్ధార్థ్ సంఘ్వి (39) ముంబై కమలా మిల్స్ ప్రాంతంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పనిచేస్తున్నారు. అక్కడే పార్కింగ్‌లో పనిచేసే సర్ఫరాజ్ షేక్ అనే వ్యక్తి బుధవారం సాయంత్రం పార్కింగ్ ఏరియాలో డబ్బు దోచుకునే ఉద్దేశంతో సిద్ధార్థ్‌తో ఘర్షణకు దిగాడు. నిందితుడు కత్తితో దాడిచేయడంతో సిద్ధార్థ్‌కు మెడచుట్టూ గాయాలై అక్కడికక్కచే చనిపోయారు. మృతదేహాన్ని సిద్ధార్థ్ కారులోనే తరలించి సమీపంలో ఉన్న థానే జిల్లా పరిధిలోని కల్యాణ్ ప్రాంతంలో పడేశాడు. తర్వాత కారును నవీ ముంబైలో వదిలేశాడు. రక్తపు మరకలతో ఉన్న ఆ కారును పోలీసులు శుక్రవారం గుర్తించారు. సంఘ్వి ఫోన్ నుంచి సర్ఫరాజ్ మాట్లాడిన కాల్స్ ఆధారంగా ఆదివారం రాత్రి అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. తాను మోటర్‌బైక్ కోసం లోన్ తీసుకున్నానని, దానికి సంబంధించిన ఈఎంఐలు కట్టడానికి రూ.30 వేలు అవసరమయ్యాయని పోలీసులకు తెలిపాడు. రూ.30 వేలు ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో సంఘ్విని దోచుకోవాలని కుట్ర పన్నాడు. డబ్బును దొంగిలించే క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుని సంఘ్వి మరణించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘ్వి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.