19 మందికి ఉరిశిక్ష


Thu,October 11, 2018 01:34 AM

Hasina assassination plot Death penalty to 19 Khaleda Zias fugitive son given life sentence

- షేక్ హసీనాపై హత్యాయత్నం కేసు
-దోషుల్లో ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ఉన్నతాధికారులు
-మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు సహా 19 మందికి జీవితఖైదు
- ఢాకా ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు

ఢాకా, అక్టోబర్ 10: బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనాను అంతమొందించే ఉద్దేశంతో 2004లో జరిపిన గ్రెనేడ్ దాడి కేసులో ఇద్దరు మాజీ మంత్రులు సహా 19 మందికి ఢాకా ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఉరిశిక్ష విధించింది. మాజీ ప్రధాని, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధినేత ఖలీదా జియా కుమారుడు, పరారీలో ఉన్న తారిక్ రెహమాన్ సహా 19 మందికి జీవితఖైదును ఖరారు చేసింది. 2004 ఆగస్టు 21వ తేదీన అవామీ లీగ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీపై జరిగిన గ్రెనేడ్ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, పార్టీ అధినాయకురాలు షేక్ హసీనాతోపాటు మరో 500 మందిపైగా గాయపడ్డారు. షేక్ హసీనాను అంతమొందించే లక్ష్యంతో ఈ దాడి జరిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న హసీనా.. దాడి సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పేలుడు కారణంగా హసీనా పాక్షికంగా వినికిడి శక్తి కోల్పోయారు. ఈ ఘటనలో దేశ మాజీ అధ్యక్షుడు జిల్లూర్ రెహమాన్ సతీమణి ఇవీ రెహమాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం తుదితీర్పును వెలువరించింది. న్యాయమూర్తి షాహిద్ నూరుద్ద్దీన్ తీర్పును వెలువరిస్తూ.. ఈ నేరానికి పాల్పడ్డ వారికి ఇక జీవించే హక్కు లేదని, చనిపోయేదాకా ఉరితీయాలని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితుల్లో 31 మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మాజీ జూనియర్ హోంమంత్రి లుత్‌ఫుజ్‌జమాన్ బాబర్, మాజీ డిప్యూటీ విద్యాశాఖ మంత్రి అబ్దుల్ సలామ్ పింటూ సహా 19 మంది ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారులకు ఉరిశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ సహా 19 మందికి న్యాయమూర్తి జీవితఖైదును ఖరారు చేశారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న రహమాన్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా న్యాయమూర్తి పేర్కొన్నారు.

అవామీ లీగ్ అంతమే లక్ష్యం..


బీఎన్పీ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు, మాజీ ప్రధాని కుమారుడు తారిఖ్ రెహమాన్, పోలీస్ ఉన్నతాధికారి, ఇంటెలిజెన్స్ అధికారులు సహా మొత్తం 49 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రధానంగా హసీనాను లక్ష్యంగా చేసుకోవడం, దాడి ఉద్దేశం వంటి 12 అంశాలను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పరిశీలించారు. ఈ దాడి షేక్ హసీనాతోసహా అవామీ లీగ్ నాయకత్వాన్ని అంతమొందించేందుకు ఉద్దేశించినది అని న్యాయమూర్తి నూరుద్ద్దీన్ పేర్కొన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత సెప్టెంబర్ 18న కేసు విచారణ ముగిసింది. హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామి (హెచ్‌యూజేఐ) ఉగ్రవాదులను సంప్రదించడం, దాడిచేసేవారికి డబ్బులు సమకూర్చడం సహా మొత్తం వ్యవహారానికి రెహమాన్ సూత్రధారి అని, బీఎన్పీ నేతృత్వంలోని నాటి ప్రభుత్వం కూడా దీనికి సహకరించిందని దర్యాప్తులో గుర్తించారు. తీర్పుపై బీఎన్పీ కార్యదర్శి ఫఖ్‌రుల్ ఇస్లాం అలాంగిర్ మాట్లాడుతూ.. ఇది రాజకీయ ప్రేరేపిత తీర్పు, రాజకీయ ప్రతీకార చర్య అని పేర్కొన్నారు. మరోవైపు ఈ దాడికి సూత్రధారిగా ఉన్న రెహమాన్ మరణశిక్షకు అర్హుడని న్యాయశాఖ మంత్రి అనిసుల్‌హఖ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని, రెహమాన్ జీవితఖైదు శిక్షను సవాల్ చేస్తామని పేర్కొన్నారు.

795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles