గుజ్జర్ల ఆందోళన ఉధృతం


Sun,February 10, 2019 02:45 AM

Gujjars stir affects Delhi Mumbai train route for 2nd day

-విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం కోటా కోసం డిమాండ్
-రైలు పట్టాలపై టెంట్లు వేసి నిరసన, జాతీయ రహదారుల దిగ్బంధం

జైపూర్, ఫిబ్రవరి 9: విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్‌లో గుజ్జర్లు చేస్తున్న ఆందోళనలు తీవ్రమయ్యాయి. రైలు, రోడ్లను దిగ్బంధించి వారు చేపట్టిన నిరసన శనివారం రెండో రోజుకు చేరుకున్నది. రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన గుజ్జర్లు అక్కడే టెంట్లు వేసి ఆందోళన చేస్తున్నారు. దీంతో గత రెండు రోజుల్లో సుమారు 200 రైళ్లను రద్దు చేసినట్లు, కొన్నింటిని దారి మళ్లించినట్లు పశ్చిమ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రభుత్వం తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే వరకూ ఆందోళన విరమించే ప్రసక్తేలేదని గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి చీఫ్ కిరోరిసింగ్ బైంస్లా తేల్చిచెప్పారు. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని మలర్నా పట్టణంలో ఆందోళనలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా కిరోరిసింగ్ బైంస్లా మాట్లాడుతూ.. మాకు రిజర్వేషన్లు ఇస్తామని ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీనిచ్చింది. దీన్ని వాళ్లు నిలబెట్టుకోవాలి. మాకు మంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్నారు. మా డిమాండ్లను వారు సావధానంగా వింటారని ఆశిస్తున్నాం. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు మాకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. మా డిమాండ్‌ను పరిష్కరించే వరకూ రైలు పట్టాలపై ఆందోళన కొనసాగిస్తాం అని అన్నారు. గత 20 రోజులుగా వివిధ రూపాల్లో తాము నిరసన తెలుపుతున్నా సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోవడం దారుణమని మండిపడ్డారు. జైపూర్-ఢిల్లీ, జోధ్‌పూర్-భిల్వారా, అజ్మీర్-భిల్వారా జాతీయ రహదారులను గుజ్జర్లు పూర్తిగా దిగ్భందించారు. మరోవైపు గుజ్జర్ల ఆందోళనలపై సంప్రదింపులు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఇప్పటికే కమిటీని నియమించింది. ప్రభుత్వం తరుఫున టూరిజం మంత్రి విశ్వేంద్రసింగ్.. బైంస్లాతో చర్చలు జరిపారు. గుజ్జర్ల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైలు పట్టాలపై నుంచి వెంటనే ఆందోళనకారులు వెనక్కిరావాలి. ఆదివారం జరిగే చర్చల్లో పాల్గొనాలి అని కోరారు.

గుజ్జర్ల రిజర్వేషన్ నేపథ్యం


విద్య, ఉద్యోగాల్లో గుజ్జర్లు, రైకా-రేబారి, గడియా లుహర్, బంజారా, గడారియా వర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంబీసీ కోటాలో వీరికి ఒక శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. 2017లో గుజ్జర్లకు ఓబీసీ కోటాలో ప్రత్యేక విభాగం కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీంతో ఓబీసీల రిజర్వేషన్లు 21 శాతం నుంచి 26 శాతానికి పెరిగాయి. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. గుజ్జర్ల రిజర్వేషన్లతో సీలింగ్ పరిధి దాటిపోవడంతో పలువురు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించడంతో వీటిపై స్టే విధించారు. 2007-08 మధ్య గుజ్జర్ల ఆందోళనల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారు.

1018
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles