గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం


Mon,February 11, 2019 01:27 AM

Gujjar agitation in Rajasthan turns violent

-పోలీసులపైకి కాల్పులకు దిగిన ఆందోళనకారులు
-మూడు పోలీసు వాహనాలకు నిప్పు
-నలుగురు పోలీసులకు గాయాలు

జైపూర్: విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ల కోసం రాజస్థాన్‌లో గుజ్జర్ల ఆందోళన ఆదివారం మూడోరోజుకు చేరింది. దోల్పూర్ జిల్లాలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వి నాటు తుపాకులతో కాల్పులకు దిగారు. పలు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘర్షణలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. గుజ్జర్ సామాజిక వర్గ ఆందోళనకారులు ఆదివారం మధ్యాహ్నం ఆగ్రా- మోరెనా హైవేని దిగ్బంధించారని దోల్పూర్ ఎస్పీ అజయ్‌సింగ్ తెలిపారు. వారికి కొన్ని మీటర్ల దూరంలో పోలీసులు ఉండగా, నిరసనకారులు రాళ్లు రువ్వారని, మూడు పోలీసు వాహనాలకు నిప్పంటించారన్నారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. ముందు జాగ్రత్తగా దోల్పూర్, కరౌలి జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా, హిందోళి-ఉన్యారా హైవేపై ఆందోళనకారులు భైఠాయించడంతో వాహనాలకు పోలీసులు దారిమళ్లించారు. రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పంటించడం సరికాదని సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. నిరసన న్యాయబద్ధమైనా రైల్వే ట్రాక్‌లపై బైఠాయించడం సరి కాదన్నారు. ఆందోళనకారులు చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఆందోళనలో సాంఘిక వ్యతిరేక శక్తులు చొరబడ్డాయ ని, హింసాత్మక ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడతారన్నారు. గుజ్జర్ల నేత బైంస్లా శాంతియుతంగా ధర్నా చేయాలని సూచించారు.

20 రైళ్లు రద్దు


కిరోరి సింగ్ బైంస్లా నేతృత్వంలో గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి కార్యకర్తలు ఆదివారం మూడోరోజూ సవాయ్ మాదోపూర్ జిల్లా మల్రానా దంగర్ రైల్వే స్టేషన్ సమీపాన ట్రాకులపై టెంట్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో 20 రైళ్లను రద్దు చేయగా, ఏడు రైళ్లను దారి మళ్లించినట్లు నార్తన్ రైల్వే ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో 65 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. కాగా, గుజ్జర్ల నేతలతో చర్చలకు సిద్దమని ప్రభుత్వ త్రిసభ్య కమిటీ సభ్యుడు, రాష్ట్ర మంత్రి రఘు శర్మ చెప్పారు. నిరసనకారులు శాంతియుతంగా ఉన్నప్పుడే సానుకూల ఫలితాలు వస్తాయన్నారు. గుజ్జర్లకు 5 శాతం కోటా అమలు చేసే వరకు పోరాటం సాగిస్తామని బైంస్లా స్పష్టం చేశారు.

575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles