జీఎస్టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్?!Fri,October 13, 2017 02:25 AM

వచ్చేనెల 9న జరుగబోయే సమావేశంలో చర్చిస్తాం: జైట్లీ
arunjaitley
వాషింగ్టన్, అక్టోబర్ 12: రియల్ ఎస్టేట్ లావాదేవీలను సైతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. వచ్చేనెల 9న గువాహటిలో జరుగబోయే జీఎస్టీ మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అత్యధికంగా పన్ను ఎగవేతలకు, నల్లధనం సృష్టికి ఈ రంగమే కారణమవుతున్నదని భారతీయ పన్ను సంస్కరణలు అనే అంశంపై హార్వర్డ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. కొన్ని రాష్ర్టాలు రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయన్న జైట్లీ.. తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అదేనన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహించే జీఎస్టీ మండలిలో అన్ని రాష్ర్టాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారన్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీలో చేర్చాలని కొన్ని రాష్ర్టాలు పట్టుబడుతుండగా.. కొన్ని వ్యతిరేకిస్తున్నాయి. వచ్చే సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తాం అని జైట్లీ వెల్లడించారు. రియల్ ఎస్టేట్‌ను జీఎస్టీలోకి తీసుకొస్తే కొనుగోలుదారులకే లాభమని, గృహం తుది పన్ను చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రస్తుతం ఇతరులకు పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించే ఉద్దేశంతో నిర్మించే వాణిజ్య సముదాయం, భవనాల నిర్మాణంపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, భూమి లేదా ఇతర స్థిరాస్తి విక్రయాలను మాత్రం జీఎస్టీ నుంచి మినహాయించారు. దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2020కల్లా 18 వేల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. దేశ జీడీపీలో గృహనిర్మాణ రంగం వాటా 5-6 శాతంగా ఉంది. ఆర్థిక మద్దతు ఇవ్వగలిగేలా దేశీయ బ్యాంకింగ్ రంగ సామర్థ్యాన్ని పునర్నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నట్లు జైట్లీ తెలిపారు.

253

More News

VIRAL NEWS