భారతమాతకు ఆకుపచ్చటి చీర!Tue,February 13, 2018 01:25 AM

-దేశంలో పెరుగుతున్న అడవులశాతం
-రెండేండ్లలో ఒక శాతం పెరుగుదల
-అడవుల విస్తీర్ణత వృద్ధిలో ఏపీ నం.1
-5వ స్థానంలో తెలంగాణ

Forestation
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రపంచవ్యాప్తంగా అడవుల శాతం తగ్గిపోతుండగా భారత్‌లో మాత్రం పెరుగుతున్నది. 2015 నుంచి 2017 వరకు రెండేండ్లలో మన దేశంలో అడవులు, చెట్లున్న ప్రాంతాల విస్తీర్ణంలో ఒక శాతం పెరుగుదల నమోదైందని భారత అటవీ నివేదిక 2017 (ఐఎఫ్‌ఎస్‌ఆర్) వెల్లడించింది. కేంద్ర పర్యావరణ మంత్రులు హర్షవర్ధన్, మహేశ్‌శర్మ సోమవారం న్యూఢిల్లీలో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం దేశ విస్తీర్ణంలో 21.54శాతం అంటే 7,08,273 చదరపు కిలోమీటర్ల మేరకు అడవులున్నాయి. అడవులతోపాటు, చెట్లున్న ప్రాంతా లను కూడా కలుపుకొంటే ఇది 24.39 అంటే 8,02,088 కిమీ ఉంది. 2015తో పోల్చుకుంటే దట్టమైన అడవులు కూడా 1.36 శాతం పెరిగాయని పర్యావరణ మంత్రిత్వశాఖ పేర్కొంది. రెండేండ్లలో దేశంలో అడవులు, చెట్లున్న ప్రాంతాల విస్తీర్ణం 8,012 కి.మీ. (8 కోట్ల 02 లక్షల హెక్టార్లు) మేర పెరిగింది. అడవుల్లో ఎక్కువశాతం పెరుగుదల నమోదుకావడం సంతోషించదగిన పరిణామమని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఐఎఫ్‌ఎస్‌ఆర్‌ను రెండేండ్లకోసారి విడుదల చేస్తారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లోకెల్లా అడవుల విస్తీర్ణం మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో 77,414 కి.మీ. మేర అడవులున్నాయి. తరువాతి స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్ (66,964కి.మీ.), ఛత్తీస్‌గఢ్ (55,547 కి.మీ.) ఉన్నాయి.

తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల్లో అడవుల విస్తీర్ణతలో గరిష్ఠవృద్ధి

అడవుల విస్త్రీర్ణతలో గరిష్ఠవృద్ధి సాధించిన రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ (2,141కి.మీ), కర్ణాటక (1,101 కి.మీ), కేరళ (1,043 కి.మీ), ఒడిశా (885 కి.మీ), తెలంగాణ (565 కి.మీ.) తొలి ఐదు స్థానా ల్లో ఉన్నాయి. మొదటిసారి ఇప్పుడు అడవుల్లో జలవనరుల గురించి కూడా లెక్కగట్టారు. గత పదేండ్లలో అడవుల్లో 2,647 కి.మీ. మేరకు జలవనరులు విస్తరించినట్లు గుర్తించారు. జలవనరుల విస్తరణ మహారాష్ట్ర (243 కి.మీ.), గుజరాత్ (428 కి.మీ.), మధ్యప్రదేశ్ (389 కి.మీ.) ఎక్కువగా జరిగింది. దాదాపు అన్ని రాష్ర్టాల్లో జలవనరుల విస్తీర్ణత పెరిగిందని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఐదు ఈశాన్య రాష్ర్టాలైన మిజోరం(51 కిమీ), నాగాలాండ్ (450 కిమీ), అరుణాచల్ ప్రదేశ్(190 కిమీ), త్రిపుర( 164 కిమీ) మేఘాలయ (116 కిమీ)ల్లో మాత్రం అడవులు క్షీణించాయి. అయితే ఆ రాష్ర్టాల భూభాగంలో అడవుల శాతం 70 కంటె అధికంగానే ఉంది. అడవుల శాతంలో భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉన్నదని మంత్రి తెలిపారు.

1113
Tags

More News

VIRAL NEWS