- కేంద్ర ప్రభుత్వ గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టులకు ఒకే టెస్ట్
- సీఈటీ నిర్వహణకు ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని కేంద్రం ప్రతిపాదన
- ఎస్సెస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ నియామకాలతో మొదలుపెట్టాలని యోచన
- ప్రభుత్వ సంస్థలతోపాటు, అభ్యర్థులకు తగ్గనున్న ఇబ్బందులు
- స్కోరును పెంచుకొనేందుకు ప్రతి అభ్యర్థికి రెండు అవకాశాలు
- మూడేండ్లపాటు చెల్లుబాటుకానున్న స్కోరు
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టులకు ఉద్యోగుల నియామకం విషయమై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇకపై ఈ నియామకాలన్నీ ప్రత్యేక సంస్థతో ఒకే ‘ఉమ్మడి అర్హత పరీక్ష’ (సీఈటీ) ద్వారా చేపట్టాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం గ్రూప్-ఏ, గ్రూప్-బీ (గెజిటెడ్)లోని ఇతర సర్వీసులతోపాటు ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఎఫ్వోఎస్ అధికారుల ఎంపికకు యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఏటేటా సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహిస్తున్నది. యూపీఎస్సీతోపాటు కేంద్ర ప్రభుత్వ విభాగాల పోస్టులకు, ప్రధానంగా గ్రూప్-బీ పోస్టుల నియామకాలను ఎస్సెస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) కూడా చేస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్-బీలోని కొన్ని గెజిటెడ్ పోస్టులు, నాన్-గెజిటెడ్ పోసు లు, గ్రూప్-సీ పోస్టులకు అభ్యర్థుల ఎంపికకు ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించినట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ (డీవోపీటీ) వెల్లడించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. దీనిపై కేంద్రంలోని అన్ని శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ/ప్రైవేటు భాగస్వాములతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలని ఆశిస్తున్న అభ్యర్థులు నెలలోపు అభిప్రాయాలు తెలుపాలని డీవోపీటీ కోరింది.
ప్రస్తుతం 6,83,823 పోస్టులు ఖాళీ
ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గతేడాది మార్చి 1 నాటికి వివిధ కేం ద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 6,83,823 (గ్రూప్-సీ క్యాటగిరీలో 5,74,289, గ్రూప్-బీలో 89,638, గ్రూప్-ఏలో 19,896) పో స్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం వివిధ ప్ర భుత్వ ఉద్యోగాలకు ఒకే అర్హతా ప్రమాణాలను నిర్దేశించినా వాటిని ఆశించే అభ్యర్థులు వేర్వే రు నియామక సంస్థలు నిర్వహించే పలురకాల పరీక్షలకు హాజరవ్వాల్సి వస్తున్నది. వీటి లో టైర్-1, టైర్-2, టైర్-3, స్కిల్ టెస్టు వం టి పలు పరీక్షలుంటున్నాయి. టైర్-1లో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. ఏటా దాదాపు 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 2.5 కోట్ల మంది అభ్యర్థులు పలు నియామక పరీక్షలకు హాజరవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సంస్థ ద్వారా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించి గ్రూప్-బీలోని కొన్ని గెజిటెడ్, నాన్-గెజిటెడ్ పోస్టులతోపాటు గ్రూప్-సీ పోస్టులకు అభ్యర్థుల షార్ట్లిస్ట్కు ఒకే ఉమ్మడి అర్హత పరీక్షను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినట్టు డీవోపీటీ పేర్కొన్నది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే అభ్యర్థులు ఒకే అర్హతలతో కూడిన ప్రభు త్వోద్యోగాలకు వివిధ సంస్థల వేర్వేరు పరీక్షలకు హాజరుకావాల్సిన ఇబ్బంది ఉండదు. ఈ పరీక్షల కో సం పలు దరఖాస్తు ఫీజులు చెల్లించాల్సిన బా ధ తప్పడంతోపాటు పరీక్షలకోసం ప్రయాణ చార్జీలు, సమయం కూడా ఆదా అవుతాయి.
నాన్-టెక్నికల్ పోస్టులతో సీఈటీ మొదలు
ప్రస్తుతం నాన్-టెక్నికల్ పోస్టులకు ఎస్సెస్సీ, ఆర్ఆర్బీలు (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు), ఐబీపీఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) ద్వారా చేస్తున్న నియామకాల్లో గ్రాడ్యుయేట్, ఇంటర్/12వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులతో మొదలుపెట్టి ఉమ్మడి అర్హత పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నట్టు డీవోపీటీ పేర్కొన్నది. ఈ పరీక్షలో అభ్యర్థి సాధించిన స్కోరు అతనితోపాటు సదరు రిక్రూట్మెంట్ సంస్థకు అందుబాటులో ఉంటుందని, పరీక్ష ఫలితం ప్రకటించినప్పటి నుంచి మూడేండ్లు ఈ స్కోరు చెల్లుబాటవుతుందన్నది. స్కోరును పెంపునకు ప్రతి అభ్యర్థికి రెండు అవకాశాలుంటాయని, ఈ రెండు అవకాశాల్లో అభ్యర్థి సాధించిన ఉత్తమ స్కోరును ప్రస్తుత స్కోరుగా పరిగణించడం జరుగుతుందని, నియామక సంస్థలు నిర్వహించే ప్రత్యేక పరీక్షల ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుందని తెలిపింది.