ఆర్టీఐ అవసరాన్ని తగ్గించాం

Sun,October 13, 2019 02:58 AM

-ముందుగానే సమాచారం అందుబాటులో ఉంచుతున్నాం
-దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఆర్టీఐ చట్టం గొప్ప మైలురాయి
-సీఐసీ వార్షిక సమ్మేళనంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: సమాచారహక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసే అవసరాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని ముందుగానే ప్రజాబాహుళ్యంలో ఉంచడమే మోదీ సర్కారు ఉద్దేశమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చెప్పారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 14వ వార్షిక సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. ఆర్టీఐ దరఖాస్తు చేసేందుకు అనువైన వేదికలు ఉన్నప్పటికీ తక్కువ సంఖ్యలో దరఖాస్తులు నమోదయ్యాయంటే ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగా ఉన్నదని అర్థం. సమాచారం పొందేందుకు ఆర్టీఐ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రజలు భావించే వ్యవస్థను ప్రవేశపెట్టాలని మేం అనుకుంటున్నాం. హక్కులతోపాటు బాధ్యతలపైనా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నది. అకారణంగా ఆర్టీఐని ఉపయోగించకూడదు.

పారదర్శకత కోసం మాత్రమే దాన్ని వాడాలి. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన డాష్‌బోర్డ్ వ్యవస్థ ద్వారా ప్రజలు ఆర్టీఐ దరఖాస్తు చేయకుండానే ఆన్‌లైన్ ద్వారా వివిధ పథకాల వివరాలు తెలుసుకోగలుగుతున్నారు. డాష్‌బోర్డ్‌తో సరికొత్త పారదర్శక యుగం మొదలైంది. ఆర్టీఐ ఉండాల్సిందే. అయితే పారదర్శకత విషయంలో చట్టానికంటే ప్రభుత్వం రెండడుగులు ముందుంది. ఆర్టీఐ అవసరం తక్కువగా ఉండేలా ప్రభుత్వం పాలనా విధులను పారదర్శకంగా నిర్వహిస్తున్నది. దేశ ప్రజాస్వామిక చరిత్రలో ఈ చట్టం గొప్ప మైలురాయి. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంలో ఇది దోహదపడింది అని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రధాన సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించేందుకు ఈ చట్టం వీలు కల్పించిందని, తద్వారా పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందని పేర్కొన్నారు.

262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles