ప్రోత్సాహకాల ఊసేది


Fri,July 12, 2019 02:37 AM

Govt thinks farmers are inferior to rich businessmen Rahul Gandhi in Lok Sabha

- బడ్జెట్‌పై రాజ్యసభలో విపక్షాల పెదవి విరుపు
- సంస్కరణల ప్రక్రియను వదిలేశారని విమర్శ
- ఇది పేదల, రైతుల అనుకూల బడ్జెట్: బీజేపీ


న్యూఢిల్లీ, జూలై 11: దేశంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలే లేవని, సాహసోపేత సంస్కరణలే కరువయ్యాయని విపక్షం పేర్కొంది. బడ్జెట్‌పై రాజ్యషభలో జరిగిన చర్చలో అధికార బీజేపీ విపక్షాల వాదనను తిప్పికొట్టింది. తమ బడ్జెట్ పేదలు, రైతుల అనుకూలమైందని అభివర్ణించింది. కాంగ్రెస్ సభ్యుడు పీ చిదంబరం బడ్జెట్‌పై చర్చలో పాల్గొం టూ.. దేశ ఆర్థిక వ్యవస్థను 2024-25 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళ్తామన్న ప్రభుత్వ ప్రకటనను తోసిపుచ్చారు. ఆర్థిక వ్యవస్థ దానంతట అదే ఆరు, ఏడేండ్లలో రెట్టింపవుతుందని, దానికి ప్రధాని, ఆర్థిక మంత్రి అవసరం లేదన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పెద్ద ఆకట్టుకోదగిన అంశాలే లేవన్నారు. ఇతర విపక్ష సభ్యు లు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిరాశానిస్పృహల మధ్య ఉన్న రైతులను ఆదుకునేందుకు గిట్టుబాటు ధరలు ప్రకటించడంతోపాటు రుణ మాఫీ కల్పించాలన్నారు. వ్యవసాయ సంక్షోభం, ఆర్ధిక మందగమనం, ఉద్యోగ లేమి, పారిశ్రామిక స్తబ్ధత తదితర అంశాలపై ప్రభుత్వం మౌనం వహిస్తున్నదని విపక్ష సభ్యులు ఆరోపించారు. విపక్షాల విమర్శలను బీజేపీ సభ్యుడు ప్రభాత్ ఝా తిప్పికొట్టారు. తమ బడ్జెట్ పేదల, రైతుల అనుకూలమైనదన్నారు. స్వతంత్య్ర సభ్యుడు, కేరళ ఎంపీ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ న్యూస్‌ప్రింట్‌పై విధించిన 10 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
Chidambaram

రైతులంటే మోదీ సర్కార్‌కు ఎందుకు చిన్నచూపు: రాహుల్

మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ మరోసారి దాడి చేశారు. మోదీ సర్కార్.. పంట రుణాలపై రైతులకు ఉపశమనం కలిగించడం లేదన్నారు. సంపన్నులతో పోలిస్తే ప్రభుత్వం రైతులను నీచమైన వారిగా భావిస్తున్నదా? అని ప్రశ్నించారు. లోక్‌సభలో జీరో అవర్‌లో కేరళలోని వయనాడ్ రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్లకు రూ.4.3 లక్షల కోట్ల రాయితీలు, రూ.5.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ రైతుల సమస్యలకు కేంద్రంలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టే కారణమన్నారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద స్థలాల (బ్లాక్ స్పాట్ల)ను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో ఒక ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నదన్నారు.

రైల్వేల ప్రైవేటీకరణకు సర్కార్ యత్నం

రైల్వేలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. రైల్వేశాఖ పద్దులపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. ఎయిరిండియాను అమ్మేస్తామని పౌర విమానయానశాఖ మంత్రి, రైల్వే ఆస్తులు అమ్మేస్తామని రైల్వే మంత్రి చెప్పారన్నారు. ఏదో ఒకరోజు దేశాన్ని ప్రధాని అమ్మేస్తారని ఆరోపించారు. ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ రైల్వేలను ప్రైవేటీకరించబోమని ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు.

వైగో, రాందాస్ సహా ఆరుగురు రాజ్యసభకు ఏకగ్రీవం

చెన్నై: ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్, డీఎంకే సభ్యులు ఎం షణ్ముగం, పీ విల్సన్, అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, మహమ్మద్ జాన్ తమిళనాడు నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ మేరకు వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ గురువారం ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అన్నాడీఎంకే సభ్యులతోపాటు పీఎంకే అధినేత రాందాస్ సచివాలయంలో సీఎం పళనిసామికి కలిసి తమ గెలుపుకు కృషిచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్‌ను ఆ పార్టీ నేతలు షణ్ముగం, విల్సన్‌లతోపాటు ఎండీఎంకే చీఫ్ వైగో కలుసుకున్నారు.

175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles