- ఒకటి కానున్న డామన్డయ్యూ-దాద్రానగర్ హవేలీ
- వచ్చేవారం పార్లమెంటులో బిల్లు
న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇప్పటివరకూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ)గా ఉన్న డామన్డయ్యూ, దాద్రానగర్ హవేలీని విలీనం చేసి ఒకటే యూటీగా మార్చే యోచనలో కేంద్రం ఉన్నది. దీనికి సంబంధించిన దాద్రానగర్ హవేలీ మరియు డామన్డయ్యూ (కేంద్రపాలిత ప్రాంతాల విలీనం) బిల్లు 2019ని వచ్చేవారం పార్లమెంటు ముందుకు తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం, ఒకే పని రెండుసార్లు చేస్తుండటం తదితర కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. డామన్డయ్యూ, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలు కేవలం 35 కి.మీ. దూరంలో ఉన్నప్పటికీ ఇరు ప్రాంతాలకు వేర్వేరు సచివాలయాలు ఉన్నాయి.
ఇరు ప్రాంతాల కోసం వేర్వేరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాద్రానగర్ హవేలీలో ఒక జిల్లా, డామన్డయ్యూలో రెండు జిల్లాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడే యూటీకి దాద్రా, నగర్ హవేలీ, డామన్డయ్యూ అనే పేరు పరిశీలనలో ఉన్నది. అలాగే, నూతన యూటీ ప్రధాన కేంద్రం డామన్డయ్యూలో ఉండే అవకాశమున్నది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, తర్వాత ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో దేశంలో ప్రస్తుతం 9 యూటీలు ఉన్నాయి. అయితే డామన్డయ్యూ, దాద్రానగర్ హవేలీ విలీనంతో దేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదికి తగ్గనున్నది.