రాఫెల్‌కు మరో మరక

Tue,February 12, 2019 04:14 AM

- ఒప్పందానికి ముందే అవినీతి నిరోధక
- జరుపాలన్న నిపుణుల సూచనలూ బేఖాతరు
- అవినీతి నిరోధక నిబంధనలకు కేంద్రం కత్తెర
- ఎస్క్రో ఖాతా ద్వారా లావాదేవీ జరుపాలన్న నిపుణుల సూచనలూ బేఖాతరు
- ఒప్పందానికి కొద్ది రోజుల ముందు కీలక నిబంధనలు తొలిగింపు
- మరో సంచలన కథనాన్ని ప్రచురించిన హిందూ

రాఫెల్ ఒప్పందంపై ది హిందూ పత్రిక మరో బాంబు పేల్చింది. భారత్, ఫ్రాన్స్ మధ్య రూ.వేల కోట్ల విలువైన ఈ ఒప్పందం కుదరడానికి కొద్ది రోజుల ముందు పలు కీలకమైన అవినీతి నిరోధక నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తొలిగించిందంటూ సోమవారం సంచలన కథనం ప్రచురించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. అలాగే ఎస్క్రో ఖాతా ద్వారా లావాదేవీలు జరుపాలన్న నిపుణుల సూచనలను కేంద్రం బేఖాతరు చేసిందని పత్రిక పేర్కొంది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారుపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. లోక్‌పాల్ చట్టాన్ని అమలు చేసి ఉంటే రాఫెల్ కుంభకోణంలో మోదీ మొదటి నిందితుడిగా ఉండేవారని కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. అవినీతి నిరోధక నిబంధనలను తొలిగించడం ద్వారా అనిల్ అంబానీకి దోచిపెట్టేందుకు ప్రధాని మోదీ ద్వారాలు తెరిచారని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మరో వివాదం తెరపైకి వచ్చింది. భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన రూ.58 వేల కోట్ల విలువైన ఈ ఒప్పందంలో భారత ప్రభుత్వం ఇంతకు మునుపెన్నడూ ఇవ్వని భారీ రాయితీలు కల్పించిందని ఆంగ్ల పత్రిక ది హిందూ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఎస్క్రో అకౌంట్ ద్వారా లావాదేవీలు జరుపాలన్న ఆర్థిక నిపుణుల సూచనలను భేఖాతరు చేయడంతోపాటు అవినీతికి వ్యతిరేకంగా జరిమానాలు విధించడం వంటి కీలక నిబంధనలను ఒప్పందం కుదరడానికి కొద్ది రోజుల ముందు ప్రభుత్వం తొలిగించిందని ఆ పత్రిక సోమవారం కథనం ప్రచురించడంతో రాజకీయ దుమారం రేగింది. రాఫెల్ ఒప్పందంపై చర్చలకు ఏర్పాటైన బృందాన్ని కాదని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతర చర్చలు జరిపిందని, భారత బృందం బేరమాడే శక్తిని ఇది బలహీనపరిచిందంటూ రక్షణ శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారని హిందూ పత్రిక ఇటీవల ప్రచురించిన కథనం కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదం బయటకు రావడంతో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలకు మరో అస్త్రం లభించింది.
Rafale1

ఉన్నతస్థాయి రాజకీయ జోక్యం...

ఒప్పందం కుదరడానికి కొద్ది రోజులు ముందు కీలక నిబంధనలు తొలిగించేలా ఉన్నతస్థాయి రాజకీయ జోక్యం చోటుచేసుకున్నట్లు హిందూ పత్రిక వెల్లడించింది. మితిమీరిన ప్రమేయంపై జరిమానా, ఏజెంట్లు/ఏజెన్సీల కమీషన్, దసాల్ట్ ఏవియేషన్, ఎంబీడీఏ ఫ్రాన్స్ ఖాతాలను తనిఖీ చేసే వెసులుబాటు వంటి వాటికి ఉద్దేశించిన స్టాండర్డ్ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రొసీజర్ (డీపీపీ) నిబంధనలను సప్లయ్ ప్రొటోకాల్స్ నుంచి ప్రభుత్వం తొలిగించిందని వివరించింది. రక్షణమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఈ మేరకు 2016 సెప్టెంబర్‌లో సమావేశమై సప్లయ్ ప్రొటోకాల్స్, ఆఫ్‌సెట్ కాంట్రాక్ట్స్, ఆఫ్‌సెట్ షెడ్యూల్స్‌కు సంబంధించి ఎనిమిది మార్పులకు ఆమోదం తెలిపింది. అంతకుముందు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2016 ఆగస్టు 24న సమావేశమై రాఫెల్ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది. 2016 సెప్టెంబర్ 23న భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందం (ఐజీఏ- ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్) ప్రకారం.. రాఫెల్ యుద్ధ విమానాల సరఫరాదారు దసాల్ట్ కాగా, ఎంబీడీఏ ఫ్రాన్స్ ఆయుధాల సరఫరా సంస్థ.

ముగ్గురు అధికారుల అభ్యంతరం

కీలక నిబంధనలు తొలిగించడంపై ఒప్పంద బృందంలో సభ్యులైన ఎంపీ సింగ్ (సలహాదారు, వ్యయాలు), ఏఆర్ సూలే (ఫైనాన్షియల్ మేనేజర్), రాజీవ్ వర్మ (సంయుక్త కార్యదర్శి, అక్విజిషన్ మేనేజర్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐజీఏ చాటున కమర్షియల్ సప్లయర్స్ దసాల్ట్, ఎంబీడీఏ ఫ్రాన్స్‌లతో నేరుగా డీలింగ్స్ జరుపుతున్న క్రమంలో కీలక నిబంధనలను తొలిగించడం తెలివైన చర్య కాదంటూ వీరు భిన్నాభిప్రాయ పత్రాన్ని అందజేశారు. అంతేగాకుండా ఇరు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, పరికరాల సరఫరా, ఇతర సేవలకు సంబంధించిన హక్కులు, అభ్యంతరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఆ రెండు సంస్థలకు బదలాయించడం, చెల్లింపులను కూడా ఫ్రాన్స్ ప్రభుత్వానికి కాకుండా ఆ ప్రైవేట్ సంస్థలకే నేరుగా చెల్లించడం సరికాదని వీరు అభిప్రాయపడ్డారు. మరోవైపు విమానాల సరఫరాకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వ/బ్యాంకు గ్యారెంటీ లేకున్నా ఫర్యాలేదని రాజీపడి, లెటర్ ఆఫ్ కంఫర్ట్‌కే ప్రభుత్వం సిద్ధపడిన నేపథ్యంలో తాజా వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లింపులు జరిపి ఉంటే ఆర్థిక భద్రత ఉండేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఖాతా ద్వారా భారత ప్రభుత్వం నేరుగా ఫ్రాన్స్ ప్రభుత్వానికి చెల్లింపులు జరిపేందుకు వీలయ్యేదని, అనంతరం ఫ్రాన్స్ సర్కారు ఆ రెండు ప్రైవేట్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు జరిపేదని తెలిపారు.

ఊహించిన దానికన్న ముందే బట్టబయలు

హిందూ కథనాల నేపథ్యంలో ప్రభుత్వం ఊహించిన దానికంటే ముందుగానే రాఫెల్ బండారం బయటపడుతున్నదని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ గ్యారెంటీ లేదు.. బ్యాంకు గ్యారెంటీ లేదు.. ఎస్క్రో అకౌంట్ లేదు.. అయినప్పటికీ భారీ మొత్తాన్ని ముందుగానే చెల్లించారు. మితిమీరిన జోక్యానికి జరిమానా నిబంధన లేదు.. ఏజెన్సీ కమీషన్‌కు వ్యతిరేకంగా నిబంధనలు లేవు.. సప్లయర్స్ ఖాతాల వినియోగంపైనా ఎలాంటి నిబంధనలు లేవు అని ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు.

1437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles