బలపరీక్షలో నెగ్గిన సావంత్


Thu,March 21, 2019 02:39 AM

Goa CM Pramod Sawant wins trust vote

గోవాలో గట్టెక్కిన బీజేపీ ప్రభుత్వం
పనాజీ, మార్చి 20: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. బీజేపీ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకున్నది. మనోహర్ పారికర్ ఆదివారం కన్నుమూయడంతో సోమవారం రాత్రి స్పీకర్ ప్రమోద్ సావంత్ గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ మృదులా సిన్హా ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు.. బలపరీక్ష కోసం బుధవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో సభ అధ్యక్షత వహించారు. 20 మంది ఎమ్మెల్యేలు ప్రమోద్‌సావంత్‌కు మద్దతుగా నిలువగా, 15మంది వ్యతిరేకించారు. గోవా అసెంబ్లీలో 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 36 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. పారికర్‌తోపాటు మరో బీజేపీ ఎమ్మెల్యే ఇటీవల మృతిచెందగా, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 36 మందిలో 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నుంచి ముగ్గురేసి ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు సావంత్ ప్రభుత్వానికి మద్దతు పలికారు.

14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించారు. ముందుగా సభ ఇటీవల మృతిచెందిన మాజీ సీఎం మనోహర్ పారికర్, మాజీ డిప్యూటీ సీఎం ఫ్రాన్సిస్ డిసౌజా, మాజీ డిప్యూటీ స్పీకర్ విష్ణు వాఘ్‌కు నివాళులు అర్పించింది. బలపరీక్షలో నెగ్గిన అనంతరం సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. సభ్యులందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. దివంగత సీఎం మనోహర్ పారికర్ తరుచూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని చెప్పేవారని, ప్రతి ఒక్కరూ దానిని అవలంభించాలని సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా గత ఏడాది జూన్ నుంచి మంచానికే పరిమితమైన మాజీ మంత్రి పాండురంగ్ మడ్కైకర్ బుధవారం అసెంబ్లీకి వీల్‌చైర్‌లో వచ్చారు. ఇదిలా ఉండగా, సుదిన్ ధవలీకర్, విజయ్ సర్దేశాయ్ డిప్యూటీ సీఎంలుగా నియమితులయ్యారు.

288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles