గోవాలో మహాకూటమి బీజేపీకి పాత మిత్రుల ఝలక్Wed,January 11, 2017 12:50 AM

పనాజీ, జనవరి 10: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను ప్రశ్నార్థకం చేస్తూ మహా కూటమి ఏర్పడింది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా సురక్షా మంచ్ (జీఎస్‌ఎం)తోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన కూడా ఈ మహాకూటమిలో భాగస్వామిగా ఉండటం విశేషం. జీఎస్‌ఎంను ఆరెస్సెస్ తిరుగుబాటు నాయకుడు సుభాష్ వెలింగ్కర్ ఏర్పాటు చేయగా.. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ గోవాలో అత్యంత పురాతన రాజకీయ పార్టీగా ఉన్నది. ఇటీవలే గోవాలో బీజేపీతో తెగతెంపులు చేసుకోవడమే కాకుండా.. లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రభుత్వంలోని తన ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకున్నది. మా మూడు పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఒప్పందానికి రావాలని నిర్ణయించుకున్నాయి. భావ సారూప్యత కలిగిన పార్టీలతో కూడిన మహా కూటమి ఇది అని ఎంజీపీ నాయకుడు సుదిన్ ధావలికర్ మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఆయనతోపాటు ఈ సమావేశంలో వెలింగ్కర్(జీఎస్‌ఎం), సంజయ్ రౌత్ (శివసేన) కూడా ఉన్నారు. గోవా అసెంబ్లీకి ఉన్న 40 స్థానాలకు గాను 35 స్థానాల్లో పోటీ చేయనున్న మహాకూటమి తరఫున సుదిన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. అయితే మిగిలిన ఐదు స్థానాల్లో మహాకూటమి ఏ వైఖరి తీసుకుంటుందన్న విషయంలో నేతలు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. సాలిగావో, థివిం, కుం కూలిం, మార్ముగోవాలో శివసేన పోటీ చేయనుంది.

సియోలిం, పనాజీ, మాయెం, శంఖలి, కుర్చోరెం, మెలిం నియోజకవర్గాల్లో జీఎస్‌ఎం అభ్యర్థులు బరిలో ఉంటారు. మిగిలిన సీట్లలో ఎంజీపీ పోటీ చేస్తుంది. కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా ఉన్న శివసేన మొదటిసారి గోవాలో తన ప్రాభవం చాటుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంగ్ల మాధ్యమంలో విద్యను బోధించే పాఠశాలలకు ప్రభుత్వ నిధులను ఉపసంహరించడమే మొదటి నిర్ణయంగా ఉంటుందని వెలింగ్కర్ ప్రకటించారు. ఆంగ్లంలో విద్యా బోధన అనేది సార్వజనీన సూత్రాలకు విరుద్ధమని ఆయన అన్నారు. వాస్తవానికి గోవాలో ప్రాంతీయ భాషలైన మరాఠీ, కొంకణిలోనే విద్యాబోధన జరుగాలన్న అంశంపై పట్టుబట్టి.. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడమే కాకుండా ఇదే అంశంపై ఆరెస్సెస్‌తో కూడా వెలింగ్కర్ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు. మహాకూటమి సమన్వయ కమిటీ కన్వీనర్‌గా వెలింగ్కర్‌నే మహాకూటమి నేతలు ఎన్నుకున్నారు.

505
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS