నిత్య కైలాసం

Thu,December 5, 2019 02:38 AM

-హల్‌చల్ చేస్తున్న నిత్యానంద రాజ్యం కైలాస
-సొంతంగా ప్రభుత్వం, పాస్‌పోర్ట్, వీసా.. విరాళం ఇస్తే పౌరసత్వం
-గుర్తింపు కోసం ఐరాసకు దరఖాస్తు చేస్తానని వెబ్‌సైట్‌లో వెల్లడి
-అది అంత సులభం కాదంటున్న విదేశాంగశాఖ అధికారులు

బెంగళూరు: ఆధ్యాత్మికత పేరుతో దేశ, విదేశాల్లో సామ్రాజ్యాన్ని నిర్మించుకొని.. భక్తి మాటున అకృత్యాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నిత్యానంద ఇప్పుడు మళ్లీ హాట్‌టాపిక్‌గా మారాడు. భారత్‌లో అడుగుపెడితే కటకటాల్లోకి వెళ్లక తప్పదని తెలిసి.. ఈక్వెడార్ సమీపంలో సొంతంగా ఓ ద్వీపాన్ని కొనుక్కున్నాడు. సెంట్రల్ అమెరికాలోని ఈక్వెడార్‌కు సమీపంలో ఉన్న ద్వీపానికి అతడు కైలాస అని పేరు పెట్టాడు. కైలాస పేరిట ఉన్న వెబ్‌సైట్‌లో అనేక వివరాలు వెల్లడించాడు. ప్రపంచంలో హిందువులకు ప్రత్యేకంగా దేశం లేదని, అందుకే తనది ప్రత్యేకంగా హిందూ దేశమని నిత్యానంద ప్రకటించుకున్నాడు. విరాళం ఇచ్చే హిందువులకు తన దేశంలో పౌరసత్వం ఇస్తానని చెప్తున్నాడు. అంతేకాదు.. హింసకు గురవుతున్న హిందువులను కైలాసకు రావాల్సిందిగా పిలుపునిస్తున్నాడు. అక్కడికి వెళ్లి చేయాల్సిందల్లా నిత్యం స్వామిని సేవించడమే. అయితే ఒక దేశాన్ని సృష్టించడం అంత సులభం కాదని, ఇది ఉట్టి హడావుడి మాత్రమేనని విదేశాంగశాఖ అధికారులు అంటున్నారు.

జెండా.. ఎజెండా

కైలాసకు సొంతగా దాదాపు 550 పేజీల రాజ్యాంగం ఉన్నది. ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలా ఉండాలో ఇందులో పేర్కొన్నారు. ఆల య ఆధారిత పర్యావరణ వ్యవస్థ, మూడోకన్ను వెనుక సైన్స్, యోగా, ధ్యానం, గురుకుల విద్య తదితర అంశాలను ప్రస్తావించారు. కైలాసకు సొంతంగా వృషభ ధ్వజ అని పేరు తో జెండా కూడా ఉన్నది.సింధూరం రంగులో ఉండే ఈ జెండాపై విశ్వరూప నిత్యానంద బొమ్మ, నంది బొమ్మను ఉంచారు. ఇక్కడ ఇంగ్లిష్, సంస్కృతం, తమిళం అధికారిక భాషలు. కైలాసలోని ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం, ఆలయాల్లో నిత్యాన్నదానం.. ఇలా నిత్యానంద అనేక ఆఫర్లు ప్రకటించాడు.

సొంతగా ప్రభుత్వం

కైలాసలో నిత్యానంద సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నాడు. తనను తాను సర్వాధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. తన సన్నిహితుడైన మా అనే వ్యక్తిని ప్రధానిగా నియమించాడు. మరికొందరితో మంత్రి మండలి ఏర్పాటుచేశారు. తాను రోజూ క్యాబినెట్ సమావేశం జరుపుతున్నానంటూ నిత్యానంద ప్రకటించడం విశేషం. అంతేకాదు.. పది ప్రభుత్వ విభాగాలనూ ప్రకటించారు. వీటన్నింటికీ పరమపూజ్య శ్రీ నిత్యానంద పరమశివమ్ (హెచ్‌డీహెచ్) అనే విభాగం నేతృత్వం వహిస్తుంది. దీంతోపాటు హోం, రక్షణ, ఆర్థిక, వాణిజ్య, గృహనిర్మాణ, మానవసేవ, విద్య, వైద్యారోగ్య, నాగరికత, సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.

అంత సులభం కాదు

కైలాసకు దేశం హోదా ఇవ్వాలని కోరుతూ త్వరలో ఐక్యరాజ్యసమితికి దరఖాస్తు చేయనున్నట్టు సమాచారం. విదేశాంగ శాఖ అధికారులు మాత్రం ఇది అంత తేలిక కాదని చెప్తున్నారు. ఒక దేశం నుంచి కొనుగోలు చేసిన చిన్న ద్వీపాన్ని, లేదా భూభాగాన్ని దేశంగా ప్రకటించడం సాధ్యం కాదన్నారు. ఐరాసలోని మిగతా దేశాలు కూడా ఇందుకు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి నిత్యానంద చేస్తున్న హడావుడిని పెద్దగా పట్టించుకోమని అధికారులు అంటున్నారు. కైలాస వెబ్‌సైట్‌ను 2018లో సృష్టించారని, కొన్ని నెలల కిందట అప్‌డేట్ చేసినట్టు చెప్తున్నారు. దీనిని అమెరికాలోని డల్లాస్, టెక్సాస్ నుంచి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

అధికారిక మతం:

సనాతన హిందూ ధర్మం
జాతీయ జంతువు: నంది
జాతీయ పక్షి: శరభం
జాతీయ పుష్పం: కమలం
జాతీయ వృక్షం: మర్రిచెట్టు

పైసలిస్తే పాస్‌పోర్ట్

కైలాస ప్రజలకు బంగారు, ఎరుపు రంగుల్లో రెండు రకాల పాస్‌పోర్ట్‌లు ఉంటాయట. ఇచ్చే విరాళాల మొత్తాన్ని బట్టి రంగు, హంగు మారుతుందన్నమాట. ఆ విరాళాలను విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధికి ఉపయోగిస్తానని చెప్తున్నాడు. తమకు 110 దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని అంటున్నాడు.

నిత్య పూజలు

వెబ్‌సైట్‌లో నిత్యానందను పరమపూజ్య భగవంతుడు శ్రీ నిత్యానంద పరమశివమ్ అని సంభోదించారు. అంటే ఆ ద్వీప ప్రజలకు ఆయనే ప్రత్యక్ష దైవమన్నమాట. ఆయన్ను నిత్యం పూజించాల్సి ఉంటుంది. ఇక్కడ హిందూ సంప్రదాయం ప్రకారం మాత్రమే జీవించాల్సి ఉంటుందట.

1680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles