అలోక్‌వర్మకు ఉద్వాసన

Fri,January 11, 2019 12:38 PM

-సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగింపు
-ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం
-తీవ్ర ంగా వ్యతిరేకించిన కమిటీ సభ్యుడు మల్లికార్జున ఖర్గే
-సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగానే వేటు
-పదవీ కాలం ముగియకుండా డైరెక్టర్‌ను తొలిగించడం సీబీఐ చరిత్రలో ఇదే మొదటిసారి
-అగ్నిమాపక సేవల విభాగానికి డీజీగా అలోక్‌వర్మ బదిలీ
-సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు తిరిగి ఎం నాగేశ్వరరావుకు అప్పగింత
-సీబీఐ డైరెక్టర్‌ను పదవి నుంచి తొలిగించిన ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత కమిటీ

సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ ఉద్వాసన పలికింది. ఆయనను తిరిగి విధులలో కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజులకే గెంటివేసింది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో అలక్ష్యం కారణంగా తొలగిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. ఆయనను అగ్నిమాపక సేవల విభాగానికి డీజీగా బదిలీచేసింది. సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను అదనపు డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావుకు మరోసారి అప్పగించింది. అలోక్‌వర్మను తొలగించాలన్న నిర్ణయాన్ని అత్యున్నత కమిటీలో సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. దర్యాప్తు అంటేనే ప్రధాని మోదీ భయపడుతున్నారని, అందుకే అలోక్‌వర్మపై వేటువేశారని కాంగ్రెస్ ఆరోపించింది.

న్యూఢిల్లీ, జనవరి 10: సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ అవమానకర రీతిలో ఉద్వాసన పలికింది. ఆయనను తిరిగి విధులలో కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రెండు రోజులకే తొలిగించింది. అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో అలక్ష్యం, ఆశించిన రీతిలో విశ్వసనీయతతో విధులు నిర్వహించక పోవడంవల్లనే అలోక్‌వర్మను విధుల నుంచి తొలిగిస్తున్నట్టు అత్యున్నత కమిటీ ప్రకటించింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మ రెండేండ్ల పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా ప్రభుత్వం ఆయనను కేంద్ర హోం శాఖ పరిధిలోని అగ్నిమాపక సేవలు, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ శాఖల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. సీబీఐ 55 ఏండ్ల చరిత్రలో పదవీ కాలం ముగియకుండా సంస్థ డైరెక్టర్ ఇలా ఉద్వాసనకు గురికావడం ఇదే మొదటిసారి. సీబీఐ డైరెక్టర్ బాధ్యతలను అదనపు డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావుకు మరోసారి అప్పగిస్తూ కేంద్రం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్‌గా తొలిగించాలన్న నిర్ణయాన్ని ఉన్నతస్థాయి కమిటీలోని ముగ్గురిలో ప్రధాని మోదీ, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రతినిధి జస్టిస్ ఏకే సిక్రీ సమర్థించగా, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకించారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలోక్‌వర్మను తిరిగి విధుల్లో నియమించాలని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఆయన ప్రధానమైన విధాన నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన విధుల నిర్వహణపై అత్యున్నత కమిటీ వారం రోజుల్లో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అత్యున్నత కమిటీ మొదట బుధవారం, తిరిగి గురువారం ప్రధాని మోదీ నివాసంలో రెండుగంటల పాటు సమావేశమైంది. దీనికి సీజేఐ తన ప్రతినిధిగా జస్టిస్ సిక్రీని పంపించారు.
alok-kumar-verma1

దర్యాప్తు అంటే ప్రధానికి భయం: కాంగ్రెస్

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తొలిగించేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది. అలోక్‌వర్మపై వచ్చిన అభియోగాలపై తన వాదన వినిపించే అవకాశం ఆయనకు ఇవ్వకపోవడాన్ని బట్టి.. దర్యాప్తు అంటే ప్రధాని భయపడుతున్నట్టు తెలుస్తున్నదని వ్యాఖ్యానించింది. రాఫెల్ కుంభకోణంపై సీబీఐ డైరెక్టర్ ద్వారా స్వతంత్ర దర్యాప్తు లేదా జేపీసీ ద్వారా పార్లమెంట్ దర్యాప్తు అంటే ప్రధాని జంకుతున్నారని విమర్శించింది. రాఫెల్ కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌శైరీ, యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గత ఏడాది అక్టోబర్ 4న అలోక్‌వర్మను కలిసి విజ్ఞప్తి చేశారు. అదే నెల 23న ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తొలిగించి, నిర్బంధ సెలవుపై పంపింది. తనను విధుల నుంచి తొలిగించడాన్ని సవాలు చేస్తూ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేస్తూ వర్మను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని మంగళవారం ఆదేశించింది. 77 రోజులపాటు విధులకు దూరంగా ఉన్న అలోక్‌వర్మ బుధవారం తన కార్యాలయానికి వచ్చారు. గురువారం ఆయన పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ సాయంత్రానికి ప్రభుత్వం ఆయనకే ఉద్వాసన పలికింది. మరోవైపు వర్మకు ఉద్వాసనపై కాంగ్రెస్ చేసిన విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. సీబీఐ అంతర్గత కలహాలలో జోక్యం చేసుకోవడం ద్వారా ఆ సంస్థను నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించింది.

8 అభియోగాలు

అలోక్‌వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఆయనపై చర్య తీసుకున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సీవీసీ నివేదికలో అలోక్‌వర్మపై ఎనిమిది ప్రధాన అభియోగాలున్నట్టు తెలిసింది. కళంకిత అధికారులను సీబీఐలో చేర్చుకొనేందుకు ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసు దర్యాప్తులో రాజీపడ్డారని సీవీసీ పేర్కొంది. మొయిన్ ఖురేషీ కేసును అలోక్‌వర్మ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్టు తమకు సాక్ష్యాధారాలు లభించాయని తెలిపింది. ఇదే కేసులో రూ.2 కోట్లు చేతులు మారడంపై నిఘా సంస్థ రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) వద్ద ఫోన్ సంభాషణల రికార్డింగులు ఉన్నాయని పేర్కొంది. ఈ కేసులో ఆయన ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, ఆయనపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరముందని సీవీసీ అభిప్రాయపడింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో అలోక్‌వర్మ ఉద్దేశపూర్వకంగా ఒక పేరును ఎఫ్‌ఐఆర్ నుంచి తొలిగించారని సీవీసీ తెలిపింది.

ఈ కేసులో ఆర్జేడీ నాయకుడు లాలూయాదవ్ నిందితునిగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని కేసులకు సంబంధించిన పత్రాలను ఆయన తమకు అందజేయలేదని, మరికొన్ని కేసుల్లో నకిలీ పత్రాలను అందజేశాడని సీవీసీ తెలిపింది. విశ్వసనీయతలేని అధికారులను సీబీఐలో భర్తీ చేసేందుకు ఆయన ప్రయత్నించారని తెలిపింది. జస్టిస్ పట్నాయక్ సమక్షంలో జరిగిన విచారణలో తన నిజాయితీని నిరూపించుకొనేందుకు ఆయనకు ఎంతో సమయమిచ్చామని, కానీ ఆయన వినియోగించుకోలేదని పేర్కొంది. ఈ అభియోగాల నేపథ్యంలో కొన్ని కేసులకు సంబంధించి అలోక్‌వర్మపై నేరవిచారణ జరుగాల్సిన అవసరముందని, సీబీఐ డైరెక్టర్‌గా ఆయన కొనసాగడం ఎంతమాత్రం భావ్యం కాదని మల్లికార్జున్ ఖర్గే మినహా అత్యున్నత కమిటీలోని మిగిలిన ఇద్దరు ప్రధాని మోదీ, జస్టిస్ సిక్రీ అభిప్రాయపడ్డారని అధికారులు తెలిపారు. సీవీసీ మోపిన అభియోగాలపై తన వాదన వినిపించే అవకాశం అలోక్‌వర్మకు ఇవ్వాలని మల్లికార్జున్ ఖర్గే గట్టిగా వాదించారని, కానీ ప్రధాని మోదీ, జస్టిస్ సిక్రీ అందుకు అంగీకరించలేదని పేర్కొన్నారు.
Justice-AKrSikri

అలోక్‌వర్మపై ప్రధాని మోదీ రెండుసార్లు వేటు వేయడం చూస్తుంటే.. ఆయన (మోదీ) తన అబద్ధాలకు తానే బందీ అయినట్టు తెలుస్తున్నది. రాఫెల్ కుంభకోణంలో జరిగిన అవినీతిపై ప్రధాని మనసులో భయం పెరుగుతున్నది. ఆయన నిద్ర కూడా పోవడం లేదు. భారత వాయుసేన నుంచి మోదీ రూ.30 వేల కోట్లు దొంగిలించి తన సన్నిహిత మిత్రుడు అనిల్ అంబానీకి కట్టబెట్టారు.


-రాహుల్‌గాంధీ

1995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles